Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైసీపీ, బీజేపీ ఒక్కటే !

రెండూ కలిసే అమరావతిని నాశనం చేశాయ్‌
రాజధాని పాదయాత్రలో సోము వీర్రాజుకు చేదు అనుభవం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ బీజేపీ సంకల్ప యాత్ర చేపట్టింది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం ఉండవల్లి సెంటర్‌లో ప్రారంభమైన యాత్ర పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా యర్రబాలెం చేరుకుంది. ఆయా గ్రామాల్లో రైతులతో సోము వీర్రాజు మాట్లాడారు. బీజేపీకి అధికారం ఇస్తే రెండేళ్లలో రాజధాని నిర్మిస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8500 కోట్లు మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. ఆ నిధులు ఏఏ నిర్మాణాల కోసం కేటాయించిందీ వివరించారు. ఇప్పుడు అమరావతి రైతుల కోసమే తాము వచ్చామన్నారు. చంద్రబాబు సగం కట్టి ఓడిపోయి వెళ్లిపోయారని, జగన్‌ ఏమో అసలు అమరావతే వద్దంటున్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు బీజేపీని వీడిన కారణంగానే ఓడిపోయి..జగన్‌ గెలిచారంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. చంద్రబాబు బీజేపీతో ఉంటే మరలా కచ్చితంగా గెలిచేవారన్నారు. అందువల్ల బీజేపీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో తాము అమరావతిని నిర్మించి ఇస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు. దీనిపై పెనుమాకకు చెందిన రైతు కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌, మీరు తోడుదొంగలై రాజధానిని నాశనం చేశారని శాపనార్థాలు పెట్టారు. దీంతో కంగుతిన్న సోము వీర్రాజు రాజధానిని నిర్మించలేని ఆయనను వదిలి తమపై పడితే ఎలా అంటూ ఆ రైతుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అమరావతి కోసం మీరేం చేశారో చెప్పాలంటూ వీర్రాజుతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కార్యక్రమం రసాభాస అయ్యే పరిస్థితి కనిపించడంతో కొందరు సర్దుబాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img