గతంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ ను మంగళగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. దుర్గాప్రసాద్ ఈ కేసులో ఏ4గా ఉన్నారు. దుర్గాప్రసాద్ కోసం గత కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులు… ఇవాళ గుంటుపల్లిలోని నివాసంలో ఉన్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనే కాకుండా, టీడీపీ కార్యాలయంపై దాడి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి ఘటనల్లోనూ దుర్గాప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. 2021 సెప్టెంబరు 17న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని వైసీపీ నేత జోగి రమేశ్ తన అనుచరులతో కలిసి ముట్టడించడం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఘటనల్లో ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.