విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు)
మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచి పట్టాలు ఇవ్వాలని శనివారం సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు పరిపాలన అధికారి శివరాముడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా కల్లుకుంట గ్రామంలోని ప్రభుత్వ భూమిని పేద రైతులకు ఇవ్వాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. దీంతో కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించడం జరిగిందని, ఈ భూమి భూస్వామి లక్ష్మన్న పేరున ఉండేదన్నారు. భూస్వామికి ప్రభుత్వ భూమి చెల్లదని పట్టాలు ఆన్లైన్ లో పేరును తొలగించడం జరిగిందన్నారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్ ఓ ఆర్ కేసు నడుస్తుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఆర్ ఓ ఆర్ కేసు పూర్తి చేసి ప్రభుత్వ భూమిని పేదలకు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, డోలు హనుమంతు పాల్గొన్నారు.