Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

నేడు రాఖీ పూర్ణిమ

రొంపిచర్ల: అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమై, పరస్పరం భద్రత, భరోసాలనిచ్చే రక్షాకవచం రాఖీ. శ్రావణ పూర్ణిమనాడు కట్టిన రక్షాసూత్రం అశుభాలను, అనారోగ్యాలను నశింపచేసి సంవత్సరమంతా రక్షణ కల్పిస్తుంది. తోబుట్టువులు ఒకరికొకరు రక్షగా ఉండాలనే సంకల్పంతో ఆచరిస్తోన్న సనాతన సంప్రదాయమిది. ఈ రక్షరేకు కట్టడం లక్ష్మీ దేవితోనే మొదలైంది. వామనావతారంలో విష్ణువు-బలిని అణచివేసి, ఆ బలి భక్తికి మురిసి, ఆతని కోరిక మేరకు కావలివానిగా ఉండిపోయాడు. ఎంతకీ వైకుంఠపురికి చేరని భర్త కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తి ఉండే సుతలలోకానికెళ్లింది. రక్షాబంధనం కట్టి, సోదరిగా మన్నించి పతినిమ్మని కోరగా విష్ణువును విడుదల చేశాడు బలి. నాటి నుంచి అక్కచెల్లెళ్లు సోదరులకు రక్షాబంధనం కడుతున్నారన్నది పురాణోదంతం.
సూర్యదేవుని పుత్రిక యమున, తన సోదరుడైన యమునికి రక్ష కట్టి, ఆడపడుచులకు యముని రక్ష ఉండాలని కోరి, ఆ వరం పొందింది. ద్రౌపదీదేవి శ్రీకృష్ణునికి రక్ష కట్టి, అనుక్షణం రక్షణ పొందింది. శాంత- శ్రీరామునికి, కామాక్షీదేవి- పెరుమాళ్‌ వరదరాజస్వామికి, మానసాదేవి- వినాయకునికి.. ఇలా దేవతామూర్తులెందరో సోదరునికి రక్ష కట్టినవారే. పూర్వం రక్షరేకు సోదరులకే కాదు భర్తలకూ కట్టేవారు. యుద్ధభూమికి వెళ్తున్న భర్తలకు రక్షాబంధనం కట్టి, వీరతిలకం దిద్దేవారు. శచీదేవి ఇంద్రునికి రక్ష కట్టి, విజయసాధనకు తోడ్పడిరది. తర్వాత్తర్వాత అన్నలకు రక్ష కట్టడం ఆనవాయితీ అయింది. చరిత్రలో కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. ముస్లిం సోదరుడు హుమాయూన్‌కి రక్ష కట్టి కర్ణావతి-తన చిన్న సామ్రాజ్యాన్ని రక్షించుకుంది. 1905 బెంగాల్‌ విభజన పోరాటంలో ముస్లిం స్త్రీలు హిందూ సోదరులకు రక్ష కట్టి, పోరాటాన్ని ఉపశమింపచేశారు. కుల, మత, వర్గ, జాతి, దేశ భేదాలు లేకుండా మహోన్నత ఐకమత్యానికి సంకేతం ఈ ఆచారం.
నేటి రాఖీ ఒకప్పుడు కేవలం పసుపు పూసిన దారం. దానికి పూజ చేసి, దేవదేవుని అనుగ్రహాన్ని అందులో నిలిపి, పసుపు కుంకుమలద్ది సిద్ధం చేస్తారు. సోదరుడంటే అమ్మానాన్నల వంటివాడేనని భావిస్తారు. నుదుట కుంకుమ పెట్టి, హారతిచ్చి, తీపి తినిపించి కుడిచేతికి కడతారు. ఆత్మీయతానుబంధాన్ని ఆస్వాదిస్తారు. అన్నల నుండి కానుకలందుకుని ఆనందిస్తారు. సూర్యుడు నడినెత్తిన ప్రచండంగా ప్రకాశిస్తున్న సమయంలో అంటే సుమారుగా పట్టపగలు 12-3 గంటల మధ్య ప్రాంతంలో రాఖీ కట్టాలని గర్గ మహర్షి నిర్ణయించాడు.
రక్షాబంధనం మొదట ఉత్తరభారత ఆచారం. ఇపుడు యావద్భారత సంప్రదాయం. మహారాష్ట్రలో నారికేళ పూర్ణిమ అనీ, నార్లీ పూర్ణిమ అనీ అంటారు. సోదరులకు కొబ్బరినీళ్లు తాగించి, అప్పడు రాఖీ కడతారు. నేపాల్‌, పాకిస్థాన్‌ దేశాల్లోనూ ఆర్భాటంగా చేసుకుంటున్నారు.
మన పండుగలన్నీ దాదాపు దైవకార్యాలతో కూడి ఉన్నవే. ఈ పండుగ మాత్రం కేవలం మనుషులకు సంబంధించింది. భక్తి ప్రపత్తులకు అతీతంగా అనురాగ మమకారాలతో చేసుకునేది. సొంతవారికే కాక బంధువులు, ఇరుగుపొరుగువారు, అన్నదమ్ముల స్నేహితులు- ఇలా అందరినీ సోదరులుగా భావించి, రాఖీ కడుతున్నారు. ఇది సర్వ సమైక్యతను సాధించింది. భారతీయులంతా సహోదరులంటూ చేసే ప్రతిజ్ఞను నిజం చేసింది ఈ పండుగ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img