Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘దిశ’ ఎక్కడుంది… ‘నిర్భయ’ ఏమైపోయింది

రమ్యశ్రీ హత్య కేసులో నింధితుడిని బహిరంగంగా శిక్షించాలి
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు

విశాలాంధ్ర`గుంటూరు : రోజురోజుకి విద్యార్థినులు, మహిళలపై దాడులు పెరిగిపోతుంటే దిశ, నిర్భయ చట్టాలు ఎక్కడున్నాయి… ఏమైపోయాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరులో రమ్యశ్రీని అత్యంత కిరాతకంగా హత్య చేసిన శశికృష్ణను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. న్యాయం కోసం రమ్యశ్రీ కుటుంబసభ్యులు చేస్తున్న డిమాండ్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రమ్యశ్రీ భౌతికకాయానికి సీపీఐ నాయకులు సోమవారం నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి సమీప ప్రాంతంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి గుంటూరు విచ్చేసి రమ్య మృతితో విషాదంలో మునిగిన కుటుంబాన్ని ఓదార్చాలని, భరోసానివ్వాలని కోరారు. నింధితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్‌ రేటు రోజురోజుకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరిగిననాడే నిజమైన స్వాతంత్య్రం అని ఆనాడు గాంధీ చెప్పారని, కానీ నేడు పట్టపగలు అత్యంత పాశవికంగా మానవమృగం అబలపై కత్తితో దాడి చేయడంతో యావత్‌ మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రమ్యశ్రీ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని లేనిపక్షంలో కుటుంబసభ్యులతో కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సీపీఐ నగర సమితి సభ్యులు సీహెచ్‌ విజయ్‌కుమార్‌, వలి, జంగాల చైతన్య, మంగా శ్రీను, వెంకట రమణ, దూపాటి వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img