Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పచ్చతోరణంగా తీర్చిదిద్దుదాం…


రాష్ట్రంలో చెట్ల పెంపకంను యజ్ఞంలా చేపట్టాలి
జగనన్న పచ్చతోరణంవన మహోత్సవంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

గుంటూరు : రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు చెట్ల పెంపకంను యజ్ఞంలా చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం(ఎయిమ్స్‌) ఆవరణలో జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం2021 కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జగనన్న పచ్చ తోరణం వన మహోత్సవంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను రాష్ట్ర ముఖ్యమంత్రి తిలకించారు. ఎయిమ్స్‌ ఆవరణలో రావి, వేప మొక్కలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాటి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం-వనమహోత్సవం2021లో మొక్కలు నాటే కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచే దిశగా అందరం ప్రయత్నం చేయాలని మనందరం కలిసి చెట్లను నాటి, వాటిని సంరక్షించేందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని గుర్తిస్తూ… ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూ, వాడవాడా, ఇంటా బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఎనర్జీ, ఫారెస్ట్‌, ఎన్విరాన్మెంట్‌, సైన్సు అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం ఆనందం ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర విస్తీర్ణంలో 22 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచి పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అడవులను పెంచి సంరక్షించడంలో రాష్ట్రం 2వ స్థానంలో ఉందని, దానిని 1వ స్థానానికి పెంచేందుకు ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అటవీ సాంకేతిక శాఖ కార్యదర్శి జి.ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌. విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ మొక్కలు పెంపకం వలన సకాలంలో వర్షాలు పడి నేల సారవంతం అవుతుందని, నేల సారం వర్షం నీటి వలన కొట్టుకుపోకుండా వృక్షాల వేర్లు కాపాడుతాయన్నారు. రాష్ట్రంలో 1,62,968 చదరపు కిలోమీటర్ల భూబాగం ఉందని, అందులో 23 శాతం అంటే దాదాపు 30 వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంగా ఉందని, దీనిలో 14,768 చదరపు కిలోమీటర్లు దట్టమైన అడవులు ఉన్నాయన్నారు. జగనన్న పచ్చతోరణం, వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అడవుల బయట 5.4 శాతం 8,932 చదరపు కిలోమీటర్లు చెట్లు పెంపకం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 5757 జాతుల జంతువులు, 3 వేలకు పైగా జాతుల వృక్షాలు, మొక్కలు ఉన్నాయని, 26 ఎకో టూరిజం పార్క్‌లు, 24 నగర వనాలు ఇప్పటికే అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ త్రిపాఠి, మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యులు బాలశౌరి, శాసనసభ ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలత, శాసనసభ సభ్యులు మద్దాలి గిరిధర్‌, ముస్తఫా, అంబటి రాంబాబు, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కిలారి రోశయ్య, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హాఫిజ్‌, సంయుక్త కలెక్టర్‌(రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌(సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతి, సంయుక్త కలెక్టర్‌(హౌసింగ్‌) అనుపమ అంజలి, సంయుక్త కలెక్టర్‌(ఆసరా, సంక్షేమం) కె.శ్రీధర్‌ రెడ్డి, జిల్లా ఆటవీ శాఖాధికారులు రామచంద్ర రాజు, విజయ్‌ కుమార్‌, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్‌ కావటి శివనాగ మనోహర నాయుడు, రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వి.లక్ష్మణ రెడ్డి, కుమ్మారి శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ మండేపూడి పురుషోత్తం, కృష్ణ బలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా భవాని, గుంటూరు ఆర్డీఓ భాస్కర రెడ్డి, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ హేమమాలిని రెడ్డి, మంగళగిరి తహశీల్దార్‌ రామ్‌ప్రసాద్‌, తాడేపల్లి తహశీల్దార్‌ శ్రీనివాస రెడ్డి, ఎయిమ్స్‌ అధికారులు, విద్యార్ధులు, రెవెన్యూ, అటవీ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img