Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోడి ప్రభుత్వానికి బుద్ది చెప్పక తప్పదు

ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి

విశాలాంధ్రగుంటూరు : కార్పొరేట్‌ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వానికి తగిన బుద్ది చెపాల్సిన సమయం అసన్నమైందని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢల్లీి పార్లమెంట్‌ వద్ద తలపెట్టిన ధర్నాకు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు మార్కెట్‌ సెంటర్‌లో మంగళవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగాలతో, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో, మహత్తర ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. లక్షల కోట్ల విలువైన ఫ్యాక్టరీ ఆస్తులను కారు చౌకగా కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా, ప్రజానీకం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న రాష్ట్ర శాసనసభలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేంద్రంలోని మోడి సర్కార్‌కు ఇవేమి పట్టడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే ఉద్యోగాలు పీకేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశ ఆయుధ ఫ్యాక్టరీలను సైతం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆయా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో సమ్మె నిరోధానికి ఆర్ధినెన్సు తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంభిస్తున్న మోడి ప్రభుత్వానికి ప్రజలు, కార్మికులు తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి ఆత్మ నిర్భర్‌ భారత్‌ను కేంద్రం ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు. కార్పొరేట్‌లకు ఊడిగం చేసే విధానాలు విడనాడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎఫ్‌టీయూ(న్యూ) నాయకులు కూరపాటి కోటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి కార్మికులను వీధి పాలు చేయడం దుర్మార్గమన్నారు. రైతాంగాన్ని, కార్మికవర్గాన్ని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు రమేష్‌ నిరసనకు సంఫీుభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కోట మాల్యాద్రి, నగర ప్రధాన కార్యదర్శి ఆకిటి అరుణ్‌కుమార్‌, సీఐటీయూ నాయకులు ముత్యాలరావు, శ్రీనివాసరావు, ఐఎఫ్‌టీయూ నాయకులు బ్రహ్మయ్య, కృష్ణ, శ్రీను, ఏఐఎఫ్‌టీయూ(న్యూ) నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, ఎల్‌ఐసీ యూనియన్‌ నాయకులు సురేష్‌, ఆటో యూనియన్‌ నాయకులు మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img