Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల మంజూరుకు చర్యలు

మంత్రి అంబటి రాంబాబు

విశాలాంధ్ర`గుంటూరు కార్పొరేషన్‌: కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ సర్వ సభ్య సమావేశం జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హెనీ కత్తెర క్రిస్టినా అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హెనీ కత్తెర క్రిస్టినా మాట్లాడుతూ ప్రస్తుత జిల్లా ప్రజా పరిషత్‌ భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం, నూతన సమావేశ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ని కోరగా, అనుమతులు మంజూరు చేసారని, ప్రతిపాదనలు సిద్దం చేయాలని రాష్ట్ర ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్‌లో ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ కేటగిరీలలో 436 మందిని బదిలీ చేయడం జరిగిందన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికపై చర్చ అనంతరం అజెండాకు సంబంధించి వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, అనుబంధ శాఖలు, విద్య, జలవనరులు అంశాలపై సభ్యులు చర్చించడం జరిగింది. అజెండా అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ కౌలు రైతులకు భూ యజమానుల అంగీకారం లేకుండా సీసీఆర్సీ కార్డులు మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు జరుగక చాలా మంది కౌలుకు పంటలు సాగు చేసేందుకు ముందుకు రావడం లేదని, దీంతో భవిష్యత్తులో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి గురై ఆహార సమస్య ఉత్పన్నమవుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. భూ యజమానుల హక్కులు రక్షిస్తూ కౌలు రైతులకు మేలు జరిగేలా సీసీఆర్సీ కార్డులు మంజురుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం తీర్మానించి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. ఎమ్మెల్సీ లక్ష్మణ రావు మాట్లాడుతూ వరికపుడిశిల ప్రాజెక్ట్‌ నిర్మాణం, గుంటూరు ఛానల్‌ విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలిమెంటరీ స్కూల్స్‌ హై స్కూల్స్‌లో విలీనం చేసే ప్రక్రియ కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్నదని, దీనిపై జిల్లా స్థాయి అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ పొన్నూరు సీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు.
సమావేశంలో అజెండాకు సంబంధించి సభ్యులు చర్చించిన అంశాలపై మంత్రి విడదల రజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నాడు నేడు ద్వారా ఆసుపత్రులలో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు, పీహెచ్సీలు, విలేజ్‌ వెల్‌నెస్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేస్తూ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారన్నారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ కృష్ణా నది వారధి నుండి రేపల్లె వరకు ఉన్న కరకట్టను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఇరిగేషన్‌ కెనాల్స్‌ మరమ్మత్తులు, పూడికతీత పనులు మంజూరు చేసిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ వరికపుడిశిలకు సంబంధించి అటవీ భూముల డీపీఆర్‌ను కేంద్ర ఎన్విరాన్మెంట్‌ మంత్రికి అందించడం జరిగిందని, అక్కడి నుండి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. గుంటూరు ఛానల్‌ విస్తరణకు భూ సేకరణ చేయాల్సి వుందని, ఆర్ధిక శాఖ నుండి నిధులు మంజూరు కాగానే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అమలు జరిగేలా సీసీఆర్సీ కార్డుల మంజూరుకు భూ యజమానులకు అవగాహన కల్పించి, వారిని ఒప్పించేలా స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు తెలిపిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకొని నివేదిక అందించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌ శ్రీనివాస్‌, జడ్పీ సీఈఓ శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లాల జెడ్పీటీసీలు, యంపీపీలు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img