Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మరో సాంస్కృతిక పునర్జీవనోద్యమం రావాలి

. దేశభక్తులు, లౌకికవాదులు మేల్కొనాలి
. కమ్యూనిస్టులు బలోపేతంతోనే పేదలకు రక్షణ
. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు

విశాలాంధ్ర`గుంటూరు : సమాజంలో మార్పుకు మరో సాంస్కృతిక పునరజ్జీవనోద్యమం రావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు మల్లయ్యలింగంభవన్‌లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర స్థాయి పాటల శిక్షణా శిబిరం మూడవ రోజు సోమవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముప్పాళ్ల మాట్లాడుతూ చట్టసభలలో రౌడీ గ్యాంగ్‌లు, జేబు దొంగలు, అసాంఘిక శక్తులు చొరబడి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు 70 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదో ఒక కేసులో నేరచరితులుగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశభక్తులు, లౌకికవాదులు మేల్కొనాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేస్తూ ఎందరో మహనీయులు రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ బీజేపీ దాని అనుబంధ సంస్థలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో 24వ జాతీయ మహాసభలు అక్టోబరు నెలలో విజయవాడలో జరుగుతున్నాయన్నారు. ఈ మహాసభలకు కళాకారులు ఆట, పాట, మాటతో ప్రజల్ని చైతన్యం చేయాలన్నారు. పాటలకు తోడుగా నృత్య రూపకాన్ని జోడిరచి కొత్త కొత్త వేషధారణతో గోసి గొంగడి, ఎర్ర శాలువాలను పెట్టుకొని బావోద్వేగాన్ని రేకెత్తించి భావాన్ని స్పష్టంగా అర్ధం అయ్యే పద్దతిలో కళారూపాలను ప్రదర్శించాలని సూచించారు. అలాగే జాతీయ మహాసభల ప్రచార దళాలను కూడా ఏర్పాటు చేసుకుని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో మూడు దళాలతో జాతీయ మహాసభలను ప్రచారం చేసే బాధ్యతను ప్రజానాట్యమండలి తీసుకోవాలన్నారు. కమ్యూనిస్టులు బలపడినప్పుడే పేద ప్రజలకు, శ్రామికవర్గానికి రక్షణ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో మా భూమి, భూమి బాగోతం, అందరూ బతకాలి, రక్త కన్నీరు లాంటి నృత్య రూపకాలతో రాష్ట్రాన్ని ఒక ఊపుఊపిన సంగతిని గుర్తుచేశారు. ప్రజానాట్యమండలి ప్రతిభ ముందు బయట కళాకారులు సరిపోరని కళాకారులను అభినందించారు. మరణం లేని మనిషి ఒక కళాకారుడు మాత్రమేనని చెప్పారు. మూడు రోజుల శిక్షణ తరగతుల్లో క్రమశిక్షణగా పాటలు నేర్చుకోవడం అభినందనీయమని, అయితే కళాకారులు మరింత నైపుణ్యత తెచ్చుకోవడానికి ఇది సరిపోదని జిల్లా స్థాయి శిక్షణ శిబిరాలు కూడా జరగాలని సూచించారు. అందులో ప్రధానంగా జిల్లాకొక నాటక దళంను, నియోజకవర్గానికి ఒక ఆటల దళంను ఏర్పాటు చేసుకోవలసిన బాధ్యత ప్రజానాట్యమండలిపై ఉందన్నారు. కొత్తగా వచ్చిన పాటలకు అద్భుతమైన ట్యూన్స్‌ చేసి కళాకారులకు పాటలు నేర్పించిన గని, చంద్ర నాయక్‌, పెంచలయ్యలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రా నాయక్‌, చిన్నం పెంచలయ్యలు మాట్లాడుతూ ప్రజానాట్యమండలి రాష్ట్ర స్థాయి పాటల శిక్షణా శిబిరంకు గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను అడిగిన వెంటనే అంగీకరించి అన్ని రకాల సహాయసహకారాలను అందించినందుకు జిల్లా సీపీఐకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య, ఆరేటి రామారావు, వి.నాగరాజు, మహేంద్ర, పున్నయ్య, జె.నాగరాజు, డప్పు వాయిద్యకారుడు సూరి, పున్నయ్య, కిన్నెర, వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img