Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

మోదీ పాలనపై రామకృష్ణ విమర్శ

నరసరావుపేట : ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్‌ వ్యవస్థలకు ఊడిగం చేస్తూ, వారికి దేశ సంపదను దోచి పెడుతూ, వారితో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ ఎన్నికల్లో గెలుస్తాడని, అంతేకాక ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. పల్నాడు జిల్లా సీపీఐ ప్రథమ మహాసభ సందర్భంగా గురువారం స్థానిక ఏంజెల్‌ టాకీస్‌లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో కామ్రేడ్‌ రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్‌ హుస్సేన్‌ అధ్యక్షత వహించారు. సమావేశంలో కామ్రేడ్‌ రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశం బీజేపీ పాలనలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని అన్నారు. కేంద్రంలో మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. జమ్మూకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసినప్పటికీ అక్కడ ఉగ్రవాదం ఏమాత్రం తగ్గకపోగా మితిమీరిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మసీదులు కూల్చడానికి బాహాటంగా చెబుతున్నాడని మండిపడ్డారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, హిందూమత ఎజెండా తీసుకురావాలని బండి సంజయ్‌ అంటున్నాడని అన్నారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీలు ఒకేసారి పుట్టాయని, అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ ముసుగులో అధికారాన్ని సాధించిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు, త్యాగాలు చేసిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు పది లక్షల ఎకరాలను పేద వర్గాలకు పంపిణీ చేశారన్నారు. 1964లో పార్టీ చీలిన తర్వాత సీపీఐకి ఓట్ల శాతం తగ్గిందన్నారు. కొన్ని దశాబ్దాల వరకు దేశంలో ప్రతిపక్షంగా ఉన్న సీపీఐకి ప్రస్తుతం అసెంబ్లీలో స్థానాలు లేవనీ, లోక్‌సభలో తమిళనాడు నుంచి ఇద్దరూ, కేరళ నుంచి ఇద్దరు మాత్రమే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. పార్టీకి బలం పెంచుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాలని, సభ్యత నమోదు పెరగాలని, కొత్త సభ్యులను చేర్చుకోవాలని, క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రామకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం జగన్‌ తండ్రి, పెంపుడు కొడుకుల పాలనతో దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం దళిత, బీసీ, మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. వీరికి సంబంధించిన గత ప్రభుత్వంలో ఉన్న ఇరవై ఎనిమిది రకాల స్కీములను రద్దు చేశారన్నారు. బీసీలకు సంబంధించిన పథకాలు గాల్లో ఉన్నాయని ఎద్దేవాచేశారు. 56 బీసీ కులాలకు చెందిన షర్మిలను ఏర్పాటు చేసి వారికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా, బీసీలకు రుణాలు అందకుండా చేశారన్నారు. రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో గద్దెదించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో సీపీఐని బలోపేతం చేయడానికి మనమందరం తీవ్రంగా కృషి చేయాలని అన్నారు. సీనియర్‌ సీపీఐ నాయకులు సీహెచ్‌ఎల్‌ కాంతారావు మాట్లాడుతూ రాజ్యాంగం, చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వమే కుల సంఘాలను ఏర్పాటు చేసి, కుల మత వర్గాల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారు. ఇది దేశ ఔన్నత్యాన్నికి వ్యతిరేకమన్నారు. ఈ సందర్భంగా సాయుధ పోరాటాలు చేసిన రోజులను గుర్తుచేశారు. పెట్టుబడి వ్యవస్థ లేకుండా చూడాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. సీపీఐ పల్నాడు జిల్లా సమితి కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్‌ ఈ ఏడాది జరిగిన పార్టీ కార్యకలాపాలు నివేదికను వివరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌, పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, చెరుకుమల్ల నిర్మల, బూదాల శ్రీనివాసరావు, ఎన్‌.వేణుగోపాల్‌, ఎం.శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, ఎం.రమణారెడ్డి, షేక్‌ సుభాని, ఉప్పలపాటి రంగయ్య, సత్యనారాయణ రాజు, వైదన వెంకట్‌, హెల్డా ఫ్లారెన్స్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img