Monday, September 26, 2022
Monday, September 26, 2022

మోదీ విధానాలపై నిరంతర పోరు

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు

రేపల్లె : భారత కమ్యూనిస్టు పార్టీ రేపల్లె నియోజకవర్గ 25వ మహాసభ శుక్రవారం పాత పట్టణంలోని పద్మశాలియ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి కనకదుర్గ, పడమటి భిక్షాలు అధ్యక్షత వహించారు. తొలుత సీపీఐ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సీపీఐ సీనియర్‌ నాయకులు రామారావు జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో కుల, మతల మధ్య చిచ్చుపెడుతూ దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేస్తూ ప్రజల మధ్య అసహనాన్ని కలిగిస్తున్నారని విమర్శించారు. 2014కు ముందు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ తాను చాయ్‌ వాలా అని ప్రచారం చేసుకుని అధికారంలోనికి వచ్చాక కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సీపీఐ పోరాడుతుందని తెలిపారు. భారతదేశంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక ప్రజా కంటక విధానాలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామిక హక్కులను హరించే విధానాలపై పోరాడాలన్నారు. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శ చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకుల విలీనీకరణ, అగ్నిపథ్‌, వంటి అనాలోచిత నిర్ణయాలతో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన ఘనత మోదీదేనన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని అన్నారు. దేశంలో తాను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు అండగా ఉంటానని నమ్మపలికి యువతను మోసం చేశారన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయకుండా జాతీయ జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఘనత మోదీదన్నారు. రాష్ట్రానికి సంబందించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి బటన్‌ నొక్కటం తప్పా అభివృద్ది పట్టదన్నారు. అంగన్‌వాడీలు, ఆశలూ, రైతులు, ఉపాధి హామీ పథకం కూలీలు, చేనేత కార్మికులు, మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు, వైద్య సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం ఆందోళనలు చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రానికి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన జగన్‌మోహన్‌ రెడ్డి మోదీకి మోకరిల్లాడని ఎద్దేవాచేసారు. రాష్ట్రంలో ముద్దాయిల పాలన అంతం చేయడానికి సీపీఐ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి నాగాంజనేయులు, ఏరియా కార్యదర్శి బాలాజీ, బాపట్ల కార్య దర్శి శ్రీధర్‌, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పి.నాగేశ్వరరావు, అంగన్‌వాడీ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, అధియ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img