Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కెజిబివిలో విద్యార్దులు ఫుల్‌.. టీచర్లు నిల్‌

2019 నుండి ఇన్‌చార్జ్‌లే దిక్కు
పిజిటిలు లేకుండానే కళాశాల అడ్మిషన్లు

విశాలాంధ్ర`కారంపూడి: స్దానిక కస్తూర్బ బాలికల విద్యాలయంలోని విద్యార్దినులకు టీచర్ల కొరత వెంటాడుతున్నది. ఈ పాఠశాలలో విద్యార్దినుల సీట్లన్ని పూర్తి స్దాయిలో భర్తి అయినవి. కాని విద్యార్దినులకు భోదించే సిబ్బంది లేకపోవడం శోచనీయం. ఈ పాఠశాలలో తెలుగు, హిందీ, లెక్కలు సబ్జెక్టులు భోదించే ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మిగతా ఇంగ్లీషు, సోషల్‌, ఎన్‌యస్‌, పియస్‌, వ్యాయమ ఉపాధ్యాయురాలు, కంప్యూటర్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది అయిన అకౌంటెంట్‌, అటెండర్‌, ఎఎన్‌ఎం పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి వరకు సుమారు 200 మంది విద్యార్దినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి మూడు సబ్జెక్టులు బోధించే సిబ్బంది ఉండటం దారుణమని విద్యార్దినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అకడమిక్‌ సంవత్సరం మొదలైన తరువాత తాత్కాలిక పద్దతిలో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ అయిన సిబ్బంది రెండు, మూడు నెలలు భోదించిన అనంతరం విధుల నుండి తప్పుకుంటారు. ఈ తతంగం అంతా ప్రతేడాది జరుగుతున్నదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సిబ్బందిని పూర్తి స్దాయిలో తీసుకోకపోవడం ప్రభుత్వ అసమర్దతకు నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేసే సిబ్బందికి 2019లో గ్రామ సచివాలయం ఉద్యోగాలు రావడంతో కొంతమంది వెళ్లగా, డిప్యూటేషన్‌పై సోషల్‌, ఇంగ్లీషు భోదించే ఉపాధ్యాయులు వెళ్లడంతో ఆ పోస్టులను నేటికి పూర్తి స్దాయిలో భర్తీ చేయలేదు. 2019 నుండి ఈ పాఠశాలకు స్పెషల్‌ ఆఫీసర్‌ లేరు. నేటికి ఇన్‌చార్జ్‌లతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ఈ అకడమిక్‌ సంవత్సరం నుండి పాఠశాలకు ఇంటర్మీడియట్‌ సిఈసి గ్రూపును యిచ్చి కళాశాలకు అప్‌గ్రేడ్‌ చేసింది. సిబ్బంది లేకుండానే అడ్మిషన్లను మొదలుపెట్టడం తల్లిదండ్రులకు ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు. పాఠశాల, కళాశాలలో ఉన్న పని భారం ఆ ముగ్గురు ఉపాధ్యాయులపై ఉండటంతో సతమతమవుతు విద్యార్దినులకు న్యాయం చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖాధికారులు స్పందించి పూర్తి స్దాయిలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని భర్తీ చేసి విద్యార్దినులకు నాణ్యమైన విద్యను అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img