Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జీఓ 22ను రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం

విశాలాంధ్ర`నరసరావుపేట కలెక్టరేట్‌ : రాష్ట్రంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ మీటర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెంబర్‌ 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రైతులు పల్నాడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవపూడి రాము మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన 3 వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన మహాధర్నాకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ నల్లచట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. అయితే మళ్లీ ఆ నల్లచట్టాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో జీవో నెంబర్‌ 22 పేరుతో విద్యుత్‌ సవరణల చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ మోటార్లను ఏర్పాటు చేసి రైతులను మరింత ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. మరోపక్క ఎరువుల రేట్లను అమాంతంగా పెంచి రైతులపై మోయలేని భారాన్ని మోపుతున్నారన్నారు. ఇప్పటికే రైతులు తమ పొలాలకు పెట్టుబడులు పెట్టలేక క్రాప్‌ హాలిడే ప్రకటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు బీడుగా మారాయని అన్నారు. పొలాలు కౌలు లేకుండా ఉచితంగా సాగు చేసుకోమన్నా కౌలు రైతులు ముందుకు రావటం లేదని అన్నారు. ఇదే పరిస్థితి మరి కొన్నేళ్లు కొనసాగితే మార్కెట్లో బియ్యం కేజీ 500 వందలకు కొనాల్సి వస్తుందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి అవసరమైన చట్టాలను అమలు చేయాలని రాము కోరారు. డాక్టర్‌ స్వామినాథన్‌ కమీషన్‌ను అమలు చేసి రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాలని, నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తాళ్లూరి బాబురావు, శ్రీనివాస్‌ రెడ్డి, అంజి రెడ్డి, అచ్యుత్‌ రెడ్డి, కొండలరావు మహిళా రైతులు లక్ష్మి, కేసరి రమణ, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img