Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉండవల్లి కొండ అక్రమ తవ్వకాలపై మంగళగిరి టీడీపీ నాయకులు ఆందోళన

విశాలాంధ్ర – తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటికి కూత వేటు దూరంలోనే యధేచ్ఛగా మైనింగ్ అక్రమాలకు పాల్పడటంపై మంగళగిరి టీడీపీ నాయకులు ఉండవల్లి క్వారీని ముట్టడించారు. తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ సమీపంలోని కొండ అక్రమ తవ్వకాలపై మంగళగిరి నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున కొండ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉదయం తాడేపల్లి టీడీపీ కార్యాలయం నుంచి ఉండవల్లి క్వారీ వరకు ర్యాలీగా వెళ్ళి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. మట్టి మాఫీయా ఆర్కే వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఉండవల్లి క్వారీ వద్ద మండుటెండను సైతం లెక్కచేయకుండా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం టేపుతో అక్రమ తవ్వకాలను కొలిచారు. రెవెన్యూ అధికారులు కొండ వద్దకు వచ్చి క్వారీకి సంబంధించిన అనుమతులు ఉంటే చూపించండి లేకుంటే జేసీబీలు, లారీలను జప్తు చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ అధికారులు రాకపోవడంతో అక్కడే టెంటు వేసుకొని ఆందోళనను ఉదృక్తం చేశారు. దీనితో అక్కడకు చేరుకున్న రెవెన్యూ అధికారి అయిన ఆర్.ఐని క్వారీకి సంబంధించిన పర్మిషన్ వివరాలు, ఆధారాలను టీడీపీ నాయకులు అడగడంతో ఆర్.ఐ తమ వద్ద క్వారీ సంబంధించిన ఆధారాలు లేవవని ఆ వివరాలు మున్సిపల్ అధికారుల దగ్గర ఉంటాయని బదులివ్వడంతో అక్కడ ఉన్నవారంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. రెవెన్యూ అధికారుల వద్ద కూడా క్వారీకి సంబంధించిన ఆధారాలు లేవని బదులివ్వడం, మండల రెవెన్యూ అధిపతి ఎమ్మార్వో క్వారీ వద్దకు రాకుండా ముఖం చాటేయడం పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అనంతరం క్వారీ వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉదృక్తంగా మారడంతో పోలీసులు ఆందోళన కారులను బలవంతంగా అరెస్ట్ చేసి రెండు వాహనాలలో పెద్దకాకాని, దుగ్గిరాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళలను సైతం బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మధ్యాహ్నం తరువాత అందరిని విడుదల చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవిలు మాట్లాడుతూ తాడేపల్లి తహశీల్దారు గ్రావెల్ దోపిడీపై సమాధానం చెప్పకపోతే రేపు అనగా బుధవారం తాడేపల్లి తహశీల్దారు కార్యాలయం ముట్టడిస్తామన్నారు. తర్వాత కూడా అధికారులు స్పందించకపోతే మరో 2 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెలే ఆళ్ల రామకృష్ణరెడ్డి, తన అనుచరులు రెండేళ్లుగా కొండను అక్రమంగా తవ్వి మట్టి, గ్రావెల్ ను పెద్ద పెద్ద లారీలతో తరలించి కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఒకొక్క లారీలో 30 నుంచి 40 టన్నుల మట్టిని తరలించి రూ. 15 వేలకు అమ్ముటున్నట్లు చెప్పారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి సెస్ కట్టకుండా ప్రతి రోజు వందలాది లారీల ద్వారా మట్టిని తరలించి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కొండ వద్ద 100 మీటర్లకు పైగా ఇష్టానుసారంగా తవ్వేయడంతో పెద్దపెద్ద గొయ్యిలు చెపల చెరువులను తలపిస్తున్నాయన్నారు. ఈ గొయ్యిల్లో నీరు చేరడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజు వందలాది లారీలు తిరగడంతో గ్రామస్థులు అనేక ఇబ్బందులకు గురి అవ్వుతున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన ఉంటూ క్వారీ నిలుపుదల చేసి వారిని అరెస్ట్ చేసే వరకు పోరాటాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img