Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కుప్పగంజి వాగులో పడిన ఆటో
నలుగురికి గాయాలు

విశాలాంధ్ర`చిలకలూరిపేట రూరల్‌ : ప్రయాణీకులతో వెళుతున్న ఆటోను వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో వాగులో పడిన ఘటన చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో చిలకలూరిపేట మండలలోని లింగంగుంట్ల గ్రామం పరిధిలో కుప్పగంజి వాగుపై ఉన్న వంతెన వద్ద శనివారం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు నరసరావుపేట వైపు నుంచి చిలకలూరిపేట వైపు వస్తోంది. ఇదే మార్గంలో నరసరావుపేట నుంచి ప్రయాణీకుల ఆటో చిలకలూరిపేట వస్తోంది. నరసరావుపేట మండలంలోని బసికాపురం వద్ద యామర్తి మీరమ్మ, బంకుగుడి సారమ్మలతోపాటు మరో ఇద్దరు ఆటోలో ఎక్కారు. మీరమ్మ, సారమ్మలు చిలకలూరిపేటలోని ఓ మాల్‌లో పనిచేస్తుంటారు. ఆటో కుప్పగంజి వాగు వంతెన వద్దకు రాగానే వెనుకనే వస్తున్న ఆర్టీసీ బస్సు రెండుసార్లు ఢీకొంది. దీంతో ఆటో కుప్పగంజి వాగులోకి దూసుకెళ్లింది. అయితే వాగులో పెద్దగా నీటి ప్రవాహం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆటో డ్రైవర్‌ చంటితోపాటు ప్రయాణీకులు నలుగురికి గాయాలయ్యాయి. వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. మీరమ్మ, సారమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది ముందుగా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నాడని ప్రయాణికులు చెప్పారు. ఈ ప్రమాదంతో చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించడంతో చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ధిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాంబాబు తెలిపారు. నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డీఎం రాంబాబు పరామర్శించారు. చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img