Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

విశాలాంధ్ర`నరసరావుపేట : కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ, దేశ సంపదను ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అతనితోపాటు మరో 11 మంది పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు వామపక్షాలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గం సమావేశంలో జంగాల అజయ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అధ్యక్షత వహించారు. జంగాల మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీని అబద్ధాల మాంత్రికుడిగా వర్ణించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రధానమంత్రి మోదీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేయాలని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. తినటానికి తిండిలేక ప్రజలు అల్లాడిపోతుంటే ఇంటికి ఒక జెండా అవసరమా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బలహీన పడిరదని ఇదే అదునుగా నరేంద్ర మోదీ ప్రాంతీయ పార్టీలను ఈడీ, సీబీఐలను బూచిగా చూపి భయబ్రాంతులకు గురి చేసి వశపరుచుకుని ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, అడగకుండానే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతు ఇచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సైతం నరేంద్ర మోదీకి భయపడుతూ వారి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడని అన్నారు. జనసేన పార్టీ ముందుగానే ధృతరాష్ట్ర కౌగిలిలో నలుగుతుందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని రానున్న రోజుల్లో వామపక్షాలు ప్రతిపక్షంగా నిలుస్తాయని అన్నారు. విజయవాడలో జరగనున్న జాతీయ మహాసభలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా రాష్ట్ర, జాతీయ నాయకులు దిశానిర్దేశం చేస్తారని జంగాల అన్నారు. అధికారమే పరమావధిగా పనిచేస్తున్న వైసీపీని, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఓవైసీ పార్టీ బీజేపీతో రహస్య ఒప్పందంతో పనిచేస్తుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం నిర్వీర్యమైపోతుందన్నారు. సీపీఐ యువతరాన్ని ప్రోత్సహించి రాజకీయ చైతన్యాన్ని కలిగించటమే ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రతిఒక్కరూ ఆర్థిక, సామాజిక రాజకీయ పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ నెల 26 తేదీ నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న మహాసభలను, అక్టోబర్‌ 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడ జగనన్న జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌ మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్ర, జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు సమాయత్తం కావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. జిల్లా సహాయ కార్యదర్శులు షేక్‌ హుస్సేన్‌, కాసా రాంబాబు లు జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హరిశెట్టి వేణుగోపాల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, భూదాల శీను, రాము, ఉప్పలపాటి రంగయ్య, సత్యనారాయణ రాజు, ఏఐవైఎఫ్‌ నాయకులు షేక్‌ సుభాని, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు షేక్‌ శిలార్‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img