విశాలాంధ్ర – తాడేపల్లి : దేశ జనాభాలో 50 శాతం జనాభా గల బీసీలకు ఇప్పటికీ ఏ రంగంలో కూడా ప్రజాస్వామ్య వాటా లభించలేదని (రాజ్యసభ పార్లమెంటు సభ్యులు) జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు.శుక్రవారం తాడేపల్లి లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.
బీసీ సంఘాలు చిన్న, చిన్న రాయితీల కోసం సమయం వృధా చేసుకోకుండా రాజ్యాధికారం కోసం జరిగే పోరాటంకు నాయకత్వం వహించి ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల వారు కొన్ని వేల సంవత్సరాలుగా తమ కుల వృత్తుల ద్వారా దేశ సంపద సృష్టించి – సమాజాన్ని బతికించారు, నడిపించారు. నేడు ప్రజాస్వామ్యవస్థలో జీవిస్తున్నాం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు జనాభా రాజకీయ,సామాజిక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, కాంట్రాక్టర్ రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి కానీ 75 ప్రకారం విద్య, ఉద్యోగ,ఆర్థిక, సంవత్సరాల కాలంలో ఏ రంగంలో కనీస వాటా కూడా లభించలేదు. దేశ సంపద సృష్టించారు కానీ సంపదలో వాటా లభించలేదు, పన్నులు కట్టారు కానీ బడ్జెట్ వాటా లభించలేదు, ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. కానీ అధికారం వాటా ఇవ్వడం లేదు.పార్టీలు మాటున అధికారం చాటున అగ్రకులాలు బీసీ కులాలను అణిచిపెట్టారు. కానీ ఒకే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇచ్చారు.రాజకీయ రంగంలో బీసీలకు 50% వాటాను అన్ని స్థాయిలలో ఇచ్చారు. అనేక స్కిమ్లు పెట్టి, కార్పొరేషన్ పెట్టి బీసీలకు బడ్జెట్లో సంపదలో వాటా ఇచ్చారు.అభివృద్ధికి బాటలు వేశారు. గత 75 సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వాలు బీసీలను అణచిపెట్టారు. బిచ్చగాళ్లను చేశారనిఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకురాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు.రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పేరుకే మనది ప్రజాస్వామ్య దేశం కాని ఆచరణలో ధనస్వామ్య దేశంగా మారిపోయిందని విమర్శించారు.డబ్బున్న పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు డబ్బులతో పార్టీ టికెట్లు కొని, డబ్బులతో ఓట్లు కొని ఆ తర్వాత ఎన్నికైన పదవిని డబ్బు సంపాదనకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.స్వాతంత్య్ర భారతంలో బి.సి లకు రాజకీయంగా కనిస ప్రాతినిధ్యం లభించడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం గత 75 సంవత్సరాల గణాంకాలు పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు వివరాలు సేకరిస్తే బి.సి ల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదు. గత 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో 56 శాతం జనాభా గల బి.సి లకు 14 శాతం ప్రాతినిధ్యం దాటలేదంటే రాజకీయ రిజర్వేషన్లు పెట్టవలిసిన ఆవశ్యకతను తెలియజేస్తుంది.
అంతేకాదు. 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుండి ఒక పార్లమెంట్ సభ్యులు లేరు. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ కనిపిస్తుందని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? ధనస్వామ్యమా? అని ప్రశ్నించారు. తెలంగాణా లో 119 యం.యల్.ఏ. లు ఉంటే బి.సి.లు కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. ఇంత తక్కువ ప్రాతినిధ్యం చూస్తే ఇలా ప్రజాస్వామ్యమవుతుంది. 56 శాతం జనాభా గల బి.సి లకు ప్రాతినిధ్యం ఏదని ప్రశ్నించారు. బి.సి లు ఓట్లు వేయడానికేనా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలుమారాలి. పేదరికం ఆకలి అనుభవించిన వారు చట్ట సభలోకి వస్తే వాటి రూపుమాపే చట్టాలు వస్తాయన్నారు.పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభ గణనలో బి.సి కుల గణన చేపట్టాలని అన్నారు.
పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతం కు పెంచాలని,
ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని, బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. అసెంబ్లీ-పార్లమెంట్ సీట్లను 100 శాతం పెంచాలి. ఇలా పెంచిన సీట్లను ఇంతవరకు అసెంబ్లీ-పార్లమెంట్ గడప తొక్కని బి.సి కులాల వారికి నామినేటెడ్ పద్ధతి మీద ఆంగ్లో-ఇండియన్లకు ఇచ్చిన మాదిరిగా నామినేట్ చేయాలి. కేంద్రంలో బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి . బి.సిల అభివృద్ధికి విద్యా అభివృద్ధికి ప్రత్యేక
స్కీములను రూపొందించాలి. ప్రత్యేకంగా కేంద్ర స్థాయి లో స్కాలర్ షిప్ లు, ఫీజుల రియంబర్స్ మెంట్, ఉపాధి రంగంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి “బి.సి యాక్టు”నుతీసుకురావాలి.
సమావేశంలో బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తొలగించాలి. రాష్ట్రంలో కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు
పెంచాలి.ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానాలు రావడంతో ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున పరిశ్రమలు వచ్చాయి.అందుకే ఎస్సీ/ఎస్టీ/బి.సిలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి.సుప్రీమ్ కోర్టు -హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు రిజర్వేషన్లు పెట్టాలి కేంద్ర స్థాయిలో రెండు లక్షా కోట్ల బడ్జెట్ తో బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. కేంద్రంలో బి.సి లకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ మరియు ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీము విధానంసాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. జాతీయ బి.సి ఫైనాన్స్ కార్పోరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి .బి.సి కార్పొరేషన్ బడ్జెట్ ఏటా50వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడి తో రుణాలుమంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాత కృష్ణారావు,
జేఏసీ అధికార ప్రతినిది మళ్లీడి సత్తి బాబు,రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏలూరు విజయలక్ష్మి, రాష్ట్ర మహిళ కార్యదర్శి పాలేటి కృష్ణవేణి, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, జేఏసీ మట్టా వీరబాబు, రాష్ట్ర బీసీ నాయకులు పున్న రామచంద్రరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ పరసా రంగనాథ్,తదితరులు పాల్గొన్నారు.