Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

పలు చోరీలకు పాల్పడ్డ దొంగ అరెస్టు

విశాలాంధ్ర`చిలకలూరిపేట రూరల్‌: ద్విచక్ర వాహనాలు, సెల్‌ ఫోన్లు, ఇళ్లల్లో బంగారం దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్‌ ఎస్సై రాజేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 29వ తేదీన తెలంగాణలోని సూర్యపేట జిల్లా, జానపాడు గ్రామానికి చెందిన అరిగిల వెంకటేశ్వర్లు తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఒంగోలు వెళుతూ మార్గమధ్యంలో చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చాడు. తన టీవీఎస్‌ స్టార్‌ సిటీ మోటార్‌ సైకిల్‌ను గుడి బయట నిలిపి ఉంచి గుడిలోపలకి పూజకు వెళ్లాడు. అనంతరం అతను తిరిగి వచ్చేసరికి అక్కడ మోటార్‌ సైకిల్‌ లేదు. తన మోటార్‌ సైకిల్‌ చోరీకి గురైందని భావించి చిలకలూరిపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్‌ ఎస్సై రాజేష్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట్ల వద్ద సోమవారం వాహనాల తనిఖీ చేస్తుండగా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన మన్నేపల్లి పవన్‌ కుమార్‌ ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా వెళుతుండటం గమనించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా తాను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం చోరీ చేసినట్టు పవన్‌కుమార్‌ ఒప్పుకున్నాడు. అదేవిధంగా నరసరావుపేట రావిపాడు రోడ్డులో, హైదరాబాద్‌ లోని ఖైరాతాబాద్‌లో దొంగతనం చేసిన 5 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ టాప్‌లు అమ్మడానికి వెళుతున్నట్లు అంగీకరించాడన్నారు. అదేవిధంగా అతను గతంలో తాడికొండ, చేబ్రోలు, నరసరావుపేట రూరల్‌, నరసరావుపేట వన్‌ టౌన్‌, పొదిలి పోలీస్టేషన్‌ ల పరిధిలో పలు ఇళ్లలో సెల్‌ ఫోన్‌ లు, ల్యాప్‌టాప్‌లు, బంగారం దొంగతనం చేసిన్నట్లు విచారణలో తేలిందన్నారు. అతనినిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజేష్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img