Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రెండు తలల పాము

హైదరాబాద్ : రెండు తలల పామును అమ్మజూపిన నలుగురు వ్యక్తుల ముఠాను పాముతో సహా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా రెండు తలల పామును (red sand boa) అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్ కేసర్ అటవీ ప్రాంతంలో ఈ పామును పట్టుకున్న ముఠా సభ్యులు కొంత కాలంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుందని, గుప్త నిధులు దొరుకుతాయానే అపోహను ప్రచారంలో పెట్టారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి, పాము కొనుగోలుదారులుగా ఆపరేషన్ మొదలు పెట్టారు. విజిలెన్స్ డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పలుమార్లు ప్రయత్నించి ఈ ముఠాను పట్టుకున్నారు. సుమారు నాలుగున్నర కేజీల బరువుతో బలంగా ఉన్న పామును డెభై లక్షలకు అమ్ముతామంటూ నలుగురు సభ్యుల ముఠా బేరంపెట్టింది. అనేక సార్లు ఆపరేషన్ చేస్తున్న అధికారులను ఏమార్చే ప్రయత్నం చేస్తూ చివరకు ఈసీఐఎల్ సమీపం నాగారంలో ఓ ఇంట్లో దొరికిపోయారు. సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ. ఆంజనేయ ప్రసాద్ ఓ ముఠాగా ఏర్పడి వివిధ ప్రయత్నాల్లో పామును అమ్మి భారీగా సొమ్ము చేసుకునే ప్రణాళిక వేశారు. నలుగురినీ అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు ఓ కారును, టూ వీలర్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరినీ మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో విజిలెన్స్, యాంటీ పోచింగ్, కీసర రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ లో పాల్గొన్న డీఎఫ్ఓ తో పాటు, విజిలెన్స్ సిబ్బందిని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్. శోభ అభినందించారు.

రెండు తలల పాము అపోహ మాత్రమే

రెండు తలల పాముగా పిలిచే రెడ్ సాండ్ బోవాకు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆపాము ద్వారా అదృష్టం, గుప్త నిధులు కలిసిరావటం అనేది పూర్తిగా అపోహ మాత్రమేనని స్పష్టంచేశారు. అలా ప్రచారం చేస్తూ డబ్బుచేసుకునే ముఠాల మాటల నమ్మవద్దని తెలిపారు. పామును అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఈ రకమైన సమాచారం తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18004255364 కు ఫిర్యాదు చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img