Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

హుజూరాబాద్‌లో ఈటల విజయం

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. ఆయన వరుసగా ఏడోసారి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇందులో మూడు ఉప ఎన్నికలు, నాలుగు సాధారణ ఎన్నికలున్నాయి. ఈటల రాజేందర్‌ గెలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 1,07,022 ఓట్లురాగా, టీఆర్‌ఎస్‌కు 83,167ఓట్లు వచ్చాయి. దీంతో ఈటల రాజేందర్‌ 23,855 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు కేవలం 3014 ఓట్లు మాత్రమే లభించాయి. అధికార టీఆర్‌ఎస్‌కు కేవలం రెండు రౌండ్లలో ఆధిపత్యం లభించడం హుజూరాబాద్‌లో ఈటల హవాను తెలియజేస్తోంది. టీఆర్‌ఎస్‌ ఓటమిపాలైన నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామని అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని, అయితే దేశంలో ఎక్కడలేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు కల్సిపనిచేశాయని చెప్పారు.ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కూడా చెప్తున్నారని, జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదని, గెలిచిననాడు పొంగిపోలేదని గుర్తుచేశారు. ఓడినా.. గెలిచినా టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని హరీశ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img