సీఎంకు రేవంత్ బహిరంగ లేఖ
విశాలాంధ్ర – హైదరాబాద్ : రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ వ్రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అడిగినంత యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత లేకుండా చూడాలని, యూరియా కొరత లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు, ఏఐఎస్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. 2017 ఏప్రిల్ 13న ప్రగతి భవన్ సాక్షిగా మీరు రైతులకు ఉచితంగా అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. అన్ని హామీలు మాదిరిగానే ఈ మాటకు దిక్కు లేకుండా పోయిందన్నారు. ఆరు నూరు అవుతుందేమో కానీ మీరు మాట మీద నిలబడడు అని మరో సారి నిరూపితమైందని ఎద్దేవా చేశారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఉచిత ఎరువులు సంగతేమో కానీ, పైసలిచ్చి కొందామనుకున్న ఎరువులు దొరక్క రైతులు అల్లాడుతున్నారన్నారు. కోఆపరేటివ్ సొసైటీలు, వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల వద్ద ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారని మండిపడ్డారు.ఒక్కో రైతుకు 20 నుంచి 30 బస్తాలు అవసరం ఉండగా, కేవలం ఒకటి నుంచి ఐదు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో రైతులు లబోదిబో మంటున్నారని ధ్వజమెత్తారు. మంత్రి జగదీశ్ రెడ్డి సొంత జిల్లా, రాష్ట్రంలో సాగుకు కీలకమైన సాగర్ ఆయకట్టు ప్రాంతాలైన సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారని వివరించారు. అలాగే సీఎం సొంత జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలోని రైతులు యూరియ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాధ్యత వహించాల్సిన వ్యవసాయ మంత్రి పత్తా లేకుండా పోయారన్నారు. ఇంత జరుగుతున్న స్పందించే తీరిక రైతు బాంధవుడు అని చెప్పుకునే హక్కు మీకు లేదన్నారు. ఎంత సేపు ఓట్లు, సీట్లు తప్ప రైతుల గోస పట్టదా అని నిలదీశారు. ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా కనీసం 2 లక్షల టన్నుల అవసరం ఉండగా ఇప్పుడు లక్షా 10 టన్నులే బఫర్ స్టాక్ మాత్రమే ఉందన్నారు. నిపుణుల సూచనలు పట్టించుకోకుండా మీరు ఇష్టారాజ్యంగా సాగిస్తున్న పాలన కారణంగా అన్నదాతలు సంక్షోభంలో చిక్కుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఓట్లు, సీట్లు అంటూ రాజకీయాలు చేయడం మాని రైతులు పడుతున్న గోసను తీర్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. తక్షణమే అధికారులను అదేశించి యూరియా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా రైతులకు సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత మీపైన ఉందన్నారు. రాష్ట్రంలోని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు.