మండల వ్యవసాయ అధికారి పివి శ్రీనివాస్
విశాలాంధ్ర – కడియం : అక్టోబర్ 26 నుండి 28వ తేదీ వరకు అధిక వర్షాలు (అర్ణబ్ తుఫాన్) కురిసే అవకాశం ఉన్నందున కడియం మండల పరిధిలోని రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారి పివి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అధిక వర్షాల వల్ల వరి పంటకు నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి పొలాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా పొలాల్లోని మురుగు కాలువలను శుభ్రపరిచి, అదనపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా చూసుకోవాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని వరి పొలాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వరి పంట కోతలను చేపట్టరాదని, వర్షాల కారణంగా కోసిన ధాన్యం తడిసిపోయి నాణ్యత తగ్గే అవకాశం ఉన్నందున, వాతావరణ పరిస్థితులను గమనించి కోతలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పొలాల చుట్టూ ఉన్న నీటి పారుదల కాలువలకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే గుర్రపు డెక్క, ఇతర కలుపు మొక్కలను తొలగించాలని, వాతావరణ శాఖ జారీ చేసే వర్ష సూచనలను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


