. భూతల దాడులనైనా ఎదుర్కొంటాం
. హెజ్బుల్లా తాత్కాలిక నేత కసేమ్
బీరుట్: ఇజ్రాయిల్ దాడిలో హెజ్బుల్లా అధినేత నస్రల్లా మంణించిన నేపథ్యంలో హెజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్, తాత్కాలిక నాయకుడిగా నైమ్ కసేమ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగిస్తామని ప్రతిన బూనారు. ‘ఇజ్రాయిల్ భూతల దాడులను ప్రారంభించాలనుకుంటే… అందుకు మేము కూడా సిద్ధమే. హెజ్బుల్లాలోని కీలక మిలటరీ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. కానీ, ఆ దాడులు మా సైనిక సామర్థ్యాలను ప్రభావితం చేయలేకపోయాయి. వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేశాం. మా ప్రాంతాలను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగిస్తాం. మా సంస్థ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైంది’’ అని నైమ్ కసేమ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయి ల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. బీరుట్‌పై జరిగిన దాడుల్లో హెజ్బుల్లా ్ల అధిపతి హసన్ నస్రల్లా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో కీలక నేతను కూడా ఐడీఎఫ్ దళాలు హతమార్చాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రికత్తలు మరోసారి భగ్గుమన్నాయి. దాడులు ప్రారంభమైన 10 రోజుల వ్యవధిలోనే నస్రల్లాతో సహా ఆరుగురు కీలక కమాండర్లు మరణించారు. లెబనాన్‌లో వేయికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. దాడుల్లో మరణించిన నస్రల్లా మృతదేహాన్ని హెజ్‌బొల్లా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. బాంబుల వర్షం కురిసిన సమయంలో షాక్‌కి గురై ఆయన ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రష్యా కీలక ప్రకటన
రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ పర్యటించనున్నారని తెలిపింది. ఆ దేశ అధ్యక్షుడితో సమావేశం కానున్నారని వెల్లడిరచింది. ప్రస్తుత ఉద్రిక్తతల వేళ.. ఇప్పటికే ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. నస్రల్లా మరణాన్ని మరో రాజకీయ హత్యగా రష్యా అభివర్ణించింది. లెబనాన్‌పై దాడులు ఆపాలని సూచించింది. ఇటు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తుంటే.. అటు ఇజ్రాయిల్, ఇరాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో రష్యా, ఇరాన్ తమ మైత్రిని పెంపొందించుకుంటున్నాయి.