టెహ్రాన్: హమాస్ అగ్ర నాయకుడు ఇస్మాయిల్ హానియే అంత్యక్రియలు ఖతార్ రాజధాని దోహాలో ముగిశాయి. అంతకుముందు ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఖమేనీ అధ్వర్యంలో జనాజా నమాజ్ ఆచరించిన అనంతరం ఇస్మాయిల్ భౌతికకాయాన్ని అంతిమ సంస్కారాల కోసం విమానంలో దోహాకు తరలించారు. హమాస్ నాయకుడికి తుది వీడ్కోలు పలికేందుకు వేల సంఖ్యలో సానుభూతిపరులు గురువారం ఉదయం టెహ్రాన్ విశ్వవిద్యాలయం వద్దకు చేరుకొన్నారు. ఇస్మాయిల్ పోస్టర్ల, పలస్తీనా జెండాలతో వచ్చి ఆయనకు నివాళులర్పించారు.
ఇది ప్రమాదకర పరిణామాలకు సంకేతం: గుటెర్రస్
టెహ్రాన్, బీరుట్‌లో ఇజ్రాయిల్ దాడులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిణామాలతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరించారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల దిశగా అన్ని కసరత్తులు జరగాలని ఆయన సూచించారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
గాజాలో కాల్పుల విరమణ ప్రశ్నార్థకమే: బ్లింకెన్
గాజాలో కాల్పుల విరమణ నేటికీ ప్రశ్నార్థకంగానే ఉన్నదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ ఖిర్బీ కూడా బ్లింకెన్‌తో ఏకీభవించారు. బీరుట్, టెహ్రాన్‌లో దాడులతో ప్రాదేశిక ఉద్రిక్త పరిస్థితలు మరింత తీవ్రతరం కాగలవని అభిప్రాయపడ్డారు. అయితే ఇజ్రాయిల్ తీరును ఖండిరచలేదు.