పాశ్చాత్య దేశాలపై పుతిన్ మండిపాటు
మాస్కో : ఉక్రెయిన్‌లో తమ లక్ష్యాలను సాధించేవరకు విశ్రమించేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ‘వాస్తవం మావైపు ఉంది. అన్ని లక్ష్యాలు సాధిస్తాం’ అంటూ ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘మన పిల్లలు, తర్వాతి తరాలకు సురక్షిత, సుసంపన్న భవిష్యత్తు అందించడం కోసం ఈ రోజు మనం పోరాడుతున్నాం’ అని తన చర్యలను సమర్థించుకున్నారు. రష్యా పట్ల ద్వేష భావాన్ని పెంపొందించే ప్రచారాన్ని ఆయన ఖండిరచారు. తన దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ను తమ కాలనీ, మిలిటరీ బేస్‌గా మార్చుకున్నారంటూ పాశ్చాత్య దేశాలను దుయ్యబట్టారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ నగరాలను ఆక్రమించుకుంది. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను మాస్కో స్వాధీనం చేసుకుని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పునరేకీకరణ దినోత్సవం నిర్వహించుకుంటూ పుతిన్ ఈ వీడియో సందేశం ఇచ్చారు. కాగా… పాశ్చాత్య దేశాల సహకారంతో పుతిన్ సేనలపై ఉక్రెయిన్ సైన్యం పోరాడుతోంది. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం ఇంతవరకూ దక్కలేదు. ఈ తరుణంలో యుద్ధం ముగింపు కోసం ప్రపంచనేతలు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు.