విక్టరీ డే నాడు అమరవీరులకు ఉ.కొరియా అధ్యక్షుడి నివాళి
‘పీపుల్స్ పారడైజ్’ నిర్మాణానికి కిమ్ పిలుపు
సియోల్: కొరియన్ యుద్ధం ముగిసి 71ఏళ్లు అయిన సందర్భంగా ఉత్తర కొరియాలో విక్టరీ డే ఘనంగా జరిగింది. కొరియా యుద్ధం ముగిసిన రోజును ఉత్తర కొరియాలో సెలవు దినంగా ఆచరిస్తారు. విక్టరీ డేగా జరుపుకుంటారు. మూడేళ్లు సాగిన కొరియా యుద్ధం 1953, జులై 27న కాల్పుల విమరణతో ముగిసింది. ఎటువంటి శాంతి ఒప్పందం జరగలేదు. విక్టరీ డేను పురస్కరించుకొని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ యుద్ధ స్మారకాలను సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. పీపుల్స్ పారడైజ్ నిర్మాణానికి పిలుపునిచ్చారు.
నాటి యుద్ధంలో ఉత్తర కొరియా దళాలతో కలిసి చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పోరాడిరదని గుర్తుచేసుకున్నారు. ఉత్తర కొరియా, చైనా మధ్య స్నేహానికి గుర్తుగా ఏర్పాటు చేసిన ‘టవర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ను కిమ్ సందర్శించారు. ‘మన సిద్ధాంతాలు, సామాజిక వ్యవస్థను సమర్థించుకోవడం, పీపుల్స్ పారడైజ్ నిర్మించుకోవడం మన తరం కర్తవ్యం, ఇది పవిత్ర మిషన్’ అని ఆయనన్నారు. యుద్ధంలో చైనా తోడ్పాటును కొనియాడారు. తమ స్నేహ బంధం మరింత పటిష్ఠంగా వర్థిల్లగలదని కిమ్ జాంగ్ ఉన్ ఆకాంక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడిరచింది.