Friday, March 31, 2023
Friday, March 31, 2023

జర్మనీలో స్తంభించిన విమానయానం

. మెరుగైన వేతనాల కోసం 8 విమానాశ్రయాల సిబ్బంది సమ్మె
. 2,300 విమానాలు రద్దు

బెర్లిన్‌/ఫ్రాన్క్‌ఫర్ట్‌: జర్మనీలో విమానయానం స్తంభించింది. ఎయిర్‌ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పెరుగుతున్న ధరలు,జీవన వ్యయం దృష్ట్యా సముచిత స్థాయిలో వేతనాల్లో పెంపుదల కోసం డిమాండ్‌ చేస్తూ ఎయిర్‌పోర్టు సిబ్బంది సమ్మెబాట పట్టారు. కార్మిక సంఘం వెర్దీ పిలుపుమేరకు ఫ్రాన్క్‌ఫర్ట్‌, మునిచ్‌, హాంబర్గ్‌తో సహా మొత్తం ఎనిమిది విమానాశ్రయాల్లో సిబ్బంది విధులను ఒకరోజు కోసం బహిష్కరించారు. దీంతో 2,300కుపైగా విమానసేవలు రద్దు కాగా మూడు లక్షల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. కార్మికసంఘం వెర్ది పిలుపుమేరకు శుక్రవారం సమ్మె విజయవంతమైంది. జర్మనీలోని అతిపెద్ద విమానయాన సంస్థ లుఫ్తాన్సా 1,300కుపైగా విమానాలను రద్దు చేసింది. ఫ్రాన్క్‌ఫర్ట్‌, మునిచ్‌ విమానాశ్రయాల్లో ఎయిర్‌ట్రాఫిక్‌ స్తంభించింది. దేశీయ విమాన సేవలు నిలిచిపోయాయి. అయితే కార్మికుల సమ్మెను జర్మన్‌ ఎయిర్‌పోర్ట్‌ అసోసియేషన్‌ ‘ఏడీవీ’ తప్పుపట్టింది. ఇది పూర్తిగా ఆక్షేపణీయమని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలేగానీ ప్రయాణికులను ఇబ్బంది పెట్టి కాదని ఏడీవీ చీఫ్‌ రాల్ఫ్‌ బైసెల్‌ పేర్కొన్నారు. సమ్మె వల్ల బ్రీమెన్‌, దార్ట్‌ముండ్‌, హాంబర్గ్‌, హానోవర్‌, లెప్జి, స్టుగార్ట్‌ నగరాల్లోనూ వైమానిక సేవలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, ఎయిర్‌పోర్టు గ్రౌండ్‌ క్రూ, ఏవియేషన్‌ భద్రతా సిబ్బంది వేతనాలు పెంచాలని వెర్దీ పోరాడుతోంది. ఇప్పటికే యాజమాన్యాలతో దఫాలవారీ చర్చలు జరుపుతోంది.తదుపరి చర్చలు ఈనెల 22`23 తేదీల్లో జరగనున్నట్లు సమాచారం. వేతనాల్లో కనీసం 10.5శాతం పెంపునకు వెర్డి డిమాండ్‌ చేస్తోంది. ఎయిర్‌పోర్టు సిబ్బందికి బోనస్‌ పెంచాలని, సాయంత్రం పనివేళలు తగ్గించాలని, సెలవులు ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేస్తోంది. ఆయా డిమాండ్లను యాజమాన్యాలు తిరస్కరించాయి. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వెర్దీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వెర్నెకె ఇప్పటికే హెచ్చరించారు. ఇదిలావుంటే జర్మనీలో వరుస సమ్మెలు జరుగుతున్నాయి. పరిశ్రమల్లో పనిచేసే వారు మొదలు పోస్టల్‌, ప్రజా రావాణా, నర్సులు మెరుగైన వేతనాల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img