130 ఏళ్లలో తొలిసారి హాజరుకానున్న రాజవంశీకుడు
లండన్: తనపై తప్పుడు కథనం ప్రచురించి, పరువు నష్టం కలిగించారని బ్రిటన్ పత్రికపై దావా వేసిన ప్రిన్స్ హ్యారీ ఈ కేసులో కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో 130 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరవుతోన్న బ్రిటన్ రాజవంశానికి చెందిన మొదటి వ్యక్తిగా ఈయన నిలవనున్నారు. ఈ కేసు వచ్చే వారం లండన్ హైకోర్టులో విచారణకు రానుంది. కింగ్ చార్లెస్ చిన్న కుమారుడు హ్యారీతో పాటు 100 మందికిపైగా ప్రముఖులు డైలీ మిర్రర్ ప్రచురణకర్త మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ సండే మిర్రర్, సండే పీపుల్స్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. లండన్ హైకోర్టులో జరిగే విచారణకు ప్రిన్స్ హ్యారీ సాక్షిగా హాజరవుతున్నారు. రాజు కావడానికి ముందు ఎడ్వర్డ్`7…1870లో విడాకుల కేసులో, 1890లో కార్డ్ గేమ్ ఆరోపణలపై పరువునష్టం దావా విచారణకు హాజరయ్యారు. రెండిరటిలోనూ సీనియర్ రాయల్ సాక్ష్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ బ్రిటన్ రాజకుటుంబంలోని ఎవరూ కోర్టుకు వెళ్లలేదు. రెండేళ్ల కిందట రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ.. బ్రిటీష్ మీడియాతో చట్టపరమైన వివాదాలు, ఇతర సీనియర్ రాయల్‌పై ఆరోపణలు, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ విడుదల వంటి వివాదాలతో ఆరు నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. గత నెలలో ఈ కేసు విచారణ ప్రారంభం కాగా.. డైలీ మిర్రర్ జర్నలిస్టులు/ ప్రైవేట్ పరిశోధకులు క్షేత్రస్థాయిలో ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, హ్యారీ సహా ఇతర ప్రముఖుల సమాచారాన్ని పొందేందుకు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ఎడిటర్లు, ఎగ్జిక్యూటివ్‌ల ఆమోదంతో ఇది జరిగిందని అభియోగాలు చెబుతున్నాయి. ఈ ఆరోపణలను మిర్రర్ గ్రూప్ తోసిపుచ్చింది.