చైనా, గబోనీస్ దేశాధ్యక్షులు జిన్‌పింగ్, బోంగో సంకల్పం
బీజింగ్ : తమ మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, గబోనీస్ రిపబ్లిక్ అధ్యక్షుడు అలీ బోంగో ఓండిరబా సంకల్పించారు. చైనా పర్యటనలో ఉన్న గబోనీస్ అధ్యక్షుడు బీజింగ్‌లో జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక సహకార బంధాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. అధ్యక్షుడు బోంగో చైనాకు పాత మిత్రుడని జిన్‌పింగ్ అన్నారు. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ తాజాగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన మొదటి ఆఫ్రికా దేశాల అధినేతగా బోంగో నిలిచారు. వీరి భేటీ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ బోంగో నేతృత్వంలో గబోనీస్ దేశం బాగా అభివృద్ధి చెందిందని, సుస్థిరత, ఆర్థిక భిన్నత్వం కోసం కృషి చేస్తోందన్నారు. ప్రాదేశిక సమగ్రత విధానాన్ని పెంపొందించుకున్న ఆ దేశాన్ని కొనియాడారు. అటవీ సదస్సును గాబోన్ విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఆఫ్రికాలో గాబోన్ ప్రాబల్యం గణనీయంగా పెరిగిందన్నారు.గాబోన్‌కు మిత్రదేశంగా మరింత పురోగతిని చైనా ఆకాంక్షిస్తోందని తెలిపారు. వచ్చే ఏడాదితో చైనాగాబోన్ దౌత్యబంధానికి 50 ఏళ్లు పూర్తి కానున్నట్లు తెలిపారు. చైనా
గాబోన్ మైత్రి చెక్కుచెదరబోదన్నారు. పరస్పరం నమ్మకంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు చైనా సానుకూలంగా ఉన్నదని చెప్పారు. గాబోన్‌కు చైనా అండ ఎల్లప్పుడు ఉంటుందని హామీనిచ్చారు. మౌలికవసతుల నిర్మాణం, అటవీ, మత్స్య, డిజిటల్ ఎకానమీ, పారిశ్రామిక పార్కుల నిర్మాణంలో కార్యకలాపాలను పెంచుకునేందుకు పూర్తిగా సహకరిస్తామని జిన్‌పింగ్ అన్నారు. పేదరికం నిర్మూలన, వ్యవసాయాభివృద్ధికి రెండు దేశాలు తమ సహకారాన్ని, సాంస్కృతిక బంధాన్ని మరింత పెంచుకోవాలని నొక్కిచెప్పారు. బోంగో మాట్లాడుతూ రెండు దేశాల ద్వైపాక్షిక బంధానికి 50ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని ఘనంగా జరుపుకుందామని అన్నారు. మిత్ర సహకారాన్ని, వ్యూహాత్మక సమగ్ర భాగస్వామ్యాన్ని పెంచుకుందామన్నారు. బహుళస్థాయిల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించుకోవాలని గాబోన్ భావిస్తోందన్నారు. ఇదిలావుంటే ఇద్దరు దేశాధినేతల భేటీ క్రమంలో అనేక ద్వైపాక్షిక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పెట్టుబడులు, వ్యవసాయం, హౌసింగ్, పట్టణ నిర్మాణం, వాతావరణ మార్పు వంటి రంగాల్లో ఒప్పందాలు జరిగినట్లు రెండు దేశాల సంయుక్త ప్రకటన వెల్లడిరచింది.