Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్‌ వారంట్‌

ఖండిరచిన రష్యా`స్వాగతించిన ఉక్రెయిన్‌
హేగ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) అరెస్టు వారంటు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ ఈ మేరకు వారెంట్‌ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలైంది.తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్‌ తేల్చిచెప్పింది. పుతిన్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు అసాధ్యమని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగించే.. మారణహోమం, మానవతా దాడులు, యుద్ధ నేరాల వంటి అత్యంత తీవ్రమైన నేరాలను ఐసీసీ విచారిస్తుందని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ తెలిపింది. ఐసీసీకి అనుమానితులను అరెస్టు చేసే అధికారాలు లేవు. ఐసీసీ ఒప్పందంపై రష్యా సంతకం చేయలేదు. దీంతో అనుమానితులను అప్పగించడం అసాధ్యం. అధ్యక్షుడిగా పుతిన్‌కు స్వదేశంలో సర్వాధికారాలు ఉన్నాయి. రష్యాలో ఉన్నంత వరకు పుతిన్‌కు అరెస్టు భయం లేదు. ఒకవేళ రష్యాను వీడితే ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పుతిన్‌పై దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఆదేశాలు అమలు చేయాలనుకునే దేశంలో పుతిన్‌ పర్యటించడం కుదరదు. ఈ వ్యవహారంలో రష్యా బాలల హక్కుల కమిషనర్‌ మారియా ల్వోవా బెలోవాపై కూడా ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఇదిలావుంటే అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు జారీ చేసిన ఈ వారంటును రష్యా పట్టించుకోవడం లేదు. రష్యా తమ దేశంపై ఐసీసీ పరిధిని ఇప్పటివరకు గుర్తించలేదు.
అందువల్ల పుతిన్‌నే కాదు.. ఏ రష్యా పౌరుడిపై కూడా ఐసీసీ చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. ఐసీసీ జారీ చేసిన వారంటు అంతర్జాతీయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నైతికంగా ఒక మచ్చలా నిలిచింది. ఐసీసీ జ్యూరిస్‌ డిక్షన్‌ ఉన్న దేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో ఒకవేళ పుతిన్‌ పాల్గొంటే, అక్కడ అతడిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఐసీసీ సభ్యదేశాలకు పర్యటనకు వెళ్లినా, అరెస్టయ్యే అవకాశం ఉంటుంది. ఐసీసీ సభ్య దేశాల దృష్టిలో పుతిన్‌ ఎన్నటికీ ఒక పరారీలో ఉన్న నిందితుడిగానే ఉండిపోతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img