Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ప్రజలందరికీ ‘క్షమాభిక్ష’

మహిళలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం
తాలిబన్ల కీలక ప్రకటన

కాబూల్‌ : అఫ్గాన్‌ను కైవశం చేసుకున్న తాలిబన్లు మంగళవారం కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రజలందరికీ ‘క్షమాబిక్ష’ ప్రకటించారు. అఫ్గాన్‌లో తాలిబన్లు యుద్ధం ముగిసిందని ప్రకటించిన వేళ.. శాంతి మంత్రం పఠించారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా మహిళలను తమ ప్రభుత్వంలో చేరాల్సిందిగా కోరారు. మహిళలు బాధపడాలని కోరుకోవడంలేదని అఫ్గాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ కల్చర్‌ కమిషన్‌ సభ్యుడు ఎనాముల్లా అఫ్గాన్‌ స్టేట్‌ టీవీలో మాట్లాడుతూ చెప్పారు. అఫ్గాన్‌ కోసం తాలిబన్లు ఇస్లామిక్‌ ఎమిరేట్‌ను ఏర్పాటుచేస్తుందని ఎనాముల్లా ప్రకటించారు. మహిళలు బాధితుల్లా మారడం మాకు ఇష్టం లేదు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగస్వామ్యం కావచ్చు. అయితే..ఇంతవరకు మేం ప్రభుత్వ విధివిధానాలను ఖరారు చేయలేదు. ఇస్లామిక్‌ నాయకత్వంలో అన్ని వర్గాలకు ప్రవేశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రభుత్వంలో భాగస్వాములు ుకావాలని పిలుపునిచ్చారు.
అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న రోజునుంచే తాలిబన్లు కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులు, ఎన్జీవో సిబ్బందిని గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నారు. దీనితో ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ప్రాణాలుపోయినా పర్వాలేదు. తాలిబన్ల పాలన భరించలేం అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. ఫలితంగా కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భయంకర వాతావరణం నెలకొంది. విమానం రెక్కలు పట్టుకొని ప్రయాణించేందుకు సిద్దమవుతున్నారు.
జాతి నిర్మాణం మా బాధ్యత కాదు : బైడెన్‌
బైడెన్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ..బైడెన్‌ మీడియా ముఖంగా స్పందించారు. రెండు దశాబ్దాల తరువాత.. అమెరికా దళాలను వెనక్కు రప్పించుకోవడం.. ఈ నిర్ణయం ట్రంప్‌ హయాంలో తీసుకున్నదేనన్నారు. అఫ్గాన్‌లో జాతి నిర్మాణం అమెరికా బాధ్యత కాదన్నారు. అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే తమ లక్ష్యంగా బైడెన్‌ స్పష్టం చేశారు. 20ఏళ్ల క్రితం అల్‌ఖైదాను అంతం చేశాం..20ఏళ్లుగా అఫ్గాన్‌ సైన్యానికి శిక్షణ ఇచ్చాం..అయితే వారు తమ శక్తిని ప్రదర్శించలేకపోయారు. ప్రభుత్వం ఊహించినదానికంటే వేగంగా పతనమైంది. అవసరమైనే అఫ్గాన్‌ ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం..అఫ్గాన్‌ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని బైడెన్‌ తేల్చి చెప్పారు. మరోవైపు తాలిబన్ల చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన బైడెన్‌.. అఫ్గన్‌ నుంచి అమెరికా ప్రతినిధులను వెనక్కి రప్పించామని, అమెరికా సైన్యానికి సాయం చేసిన అఫ్గాన్‌ ప్రజలకు అవసరమైన చేయూత అందిస్తామని స్పష్టం చేశారు. అయితే తమ దేశంలో తిరిగి తాలిబన్ల పాగాకు బైడెన్‌ కారకుడని అమెరికాలో స్థిరపడ్డ అఫ్గాన్‌ వాసులు ఆందోళన చేపట్టారు. బైడెన్‌ మోసకారుడని ఆగ్రహించారు.
అఫ్గాన్‌ ఉగ్రవాద స్థావరం కారాదు : చైనా
అఫ్గానిస్తాన్‌ ‘ఉగ్రవాద స్థావరం’ కారాదని తాలిబన్లను చైనా హెచ్చరించింది. ఇస్లామిక్‌ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారని. అధికార మార్పిడి సజావుగాఉంటుందని ఐక్యరాజ్యసమితిలో చైనా ఉప(డిప్యూటీ) శాశ్వత ప్రతినిధి గెంగ్‌ ఘవాంగ్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌ పరిస్థితిపై ఐరాస భద్రతామండలి అత్యవసర సమావేశంలో మాట్లాడిన గెంగ్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తెంచుకోవాలని సూచించారు. తాలిబన్లు లోగడ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు.
అఫ్గాన్‌ పరిణామాలను అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి టెర్రరిస్టు సంస్థలు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా తమ దళాలను ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిరదని గెంగ్‌ పేర్కొన్నారు. అన్ని దేశాలు తమ బాధ్యతలను అంతర్జాతీయ చట్టాలు, భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా నిర్వర్తిస్తాయని గెంగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ ప్రజలు తమ మాతృభూమిని పునర్నిర్మించుకునేందుకు తాలిబన్లు వారికి సహకరించాలని చైనా విదేశాంగ శాఖ మహిళా అధికార ప్రతినిధి హువా చున్‌ ఇంగ్‌ బీజింగ్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తాలిబన్లతో రాజకీయ అవగాహన కుదుర్చుకునేవరకు తాము ఆ ప్రభుత్వాన్ని గుర్తించే అవకాశాలు లేవని పేర్కొన్నారు.
స్త్రీల రక్షణలో ప్రపంచం ఘోర వైఫల్యం
కాబూల్‌: అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో తమ భవిష్యత్తు అస్తవ్యస్తంగా ఉందని అఫ్గాన్‌ బాలిక కళ్లనీళ్లుపెట్టుకున్న హృదయ విదారక వీడియో వైరల్‌ అయింది. ఆమె అఫ్గానిస్తాన్‌తో ప్రపంచం ఎలా వ్యవహరిస్తుందనే దానిపై మాట్లాడిరది. యుద్ధంలో దెబ్బతిన్న దేశాన్ని తర్వలో ప్రపంచం మరచిపోతుందని ఆవేదన చెందింది. మహిళలను రక్షించడంలో ప్రపంచం విఫలమైందని అక్రోశించింది. ప్రపంచం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ..ఎందుకంటే తాము ఆఫ్గాన్‌లమని ఆ బాలిక వాపోయింది. చరిత్ర అఫ్గాన్‌ స్త్రీల చరిత్రను లిఖించాలని పేర్కొంది. ఈ వీడియోను ఇరాన్‌ జర్నలిస్టు, కార్యకర్త మాసిష్‌ పోస్టు చేశారు. అఫ్గాన్‌ మహిళల కోసం నాగుండె పగిలిపోతోంది అని అన్నారు.. అఫ్గాన్‌ దేశంలో తీవ్ర మానవ సంక్షోభం ఏర్పడిరదని, ఆ దేశ ప్రజలకు మద్దతు ఇవ్వాలని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా విన్నవించారు. అఫ్గాన్‌లో మహిళలు, బాలికలను రక్షించే దిశగా ప్రపంచ దేశాధినేతలు కదలిరావాలని తాలిబన్లపై చర్యలు తీసుకోవాలని మలాలా కోరారు. మహిళలు ధరించే దుస్తులపై సైతం తాలిబన్లు ఆంక్షలు విధించారని బాలికల రక్షణ సమస్యాత్మకంగా మారిందని వాపోయారు.
మేయర్‌ జరీఫా సవాల్‌
తాలిబన్లు తన కోసం తప్పక వస్తారని, చంపేస్తారని పేర్కొన్న గఫారీ శాంతి ప్రక్రియ కోసం ‘‘నిరంతర మద్దతు’’ కోసం గఫారీ యుఎస్‌ని కోరారు. అఫ్గాన్‌లో మొట్టమొదటి మహిళా మేయర్‌ అయిన జరీఫా గఫారీ, తాలిబన్లు తనను చంపేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ఇంటర్నేషనల్‌ ఉమెన్‌ ఆఫ్‌ కరేజ్‌ అవార్డ్‌ తీసుకున్న గఫారీ.. ఇప్పటికే అనేకమార్లు హత్యాహత్యానికి లోనయ్యారు. నిరాశా నిస్పృహల మధ్య ఆఫ్ఘన్‌ ప్రజలు ఉన్నారని గఫారీ పేర్కొన్నారు. ఆమె తండ్రి, ఆఫ్ఘన్‌ ఆర్మీ కల్నల్‌ను నవంబర్‌లో ఇంటి ముందు హత్య చేశారు. ఆ సమయంలో వారు తనను చంపలేక, తన తండ్రిని చంపారు అని పేర్కొన్నారు.
తాలిబన్ల చేతుల్లో లిథియం నిక్షేపాలు..!
కాబూల్‌: అవినీతి, అధికార లోపంకారణంగా గత పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న లిథియం నిక్షేపాలపై తాలిబన్లు పట్టు సాధించారు. నల్లమందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, పునరుత్పాదక శక్తి బ్యాటరీలకు ఉపయోగపడే ఈ ఖనిజ సంపద ద్వారా ప్రధాన ఆర్థిక వనరుగా వినియోగిస్తారా..అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎలక్ట్రిక్‌ వాహనాల పునరుత్పాదకతకు ఈ సిల్వర్‌ మెటల్‌ ఎంతో అవసరం. అయితే తాలిబన్లు వీటిని ఉపయోగించగలరా అనేది ప్రశ్నగా ఉంది. అఫ్గాన్‌లో నెలకొన్న అపారమైన ఖనిజ సంపద ఆ దేశానికి పదునైన కత్తి వంటిది. 2020నాటితో పోలిస్తే గ్లోబల్‌ డిమాండ్‌ 2040నాటికి లిథియం వినియోగం 40 రెట్లు పెరగనుంది. ఈ ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా తక్కువగా లభ్యమవుతున్న తరుణంలో అఫ్గాన్‌కు దీని ద్వారా గణనీయమైన ఆదాయం పెరగనుంది.
తాలిబన్లకు జర్మనీ షాక్‌..
అఫ్గాన్‌లకు డెవలప్‌మెంట్‌ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. ఈ మేరకు జర్మన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి గెర్జ్‌ ముల్లర్‌ రినిష్‌ మీడియాకు వివరించారు. దేశానికి అభివృద్ధి సహకారాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని ..కాబూల్‌ విమానాశ్రయంలో వేలాదిమంది ప్రజలు దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానవ విషాదానికి అందరం బాధ్యులమని వ్యాఖ్యానించారు.
సంవత్సరానికి 430 మిలియన్‌ యూరోలు (506 మిలియన్‌ డాలర్లు) అఫ్గాన్‌ అందించేందుకు జర్మనీ అంగీకరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి రావడంతో ఒక్క సెంటు కూడా అందించబోమని జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img