Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

ప్రతి భారతీయుడిని కాపాడటంపైనే దృష్టి

కొనసాగుతున్న ఆపరేషన్‌ కావేరి: క్వాత్రా
న్యూదిల్లీ: సూడాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూ అక్కడ అనిశ్చితి నెలకొన్నది. ఆ దేశంలో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని అపాయం నుంచి తప్పించడంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించామని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా తెలిపారు. ఆపరేషన్‌ కావేరి గురించి విలేకరులతో మాట్లాడుతూ సుమారు 2వేల మంది భారతీయులను ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి తరలించామన్నారు. గురువారం పోర్ట్‌ సూడాన్‌కు మూడో నౌక ఐఎన్‌ఎస్‌ తర్కష్‌ చేరుకున్నదన్నారు. పౌరుల తరలింపునకు మద్దతిస్తున్న సౌదీ అరేబియాకు కృతజ్ఞులమన్నారు. పౌరుల తరలింపు వేగం పుంజుకున్నట్లు క్వాత్రా తెలిపారు. ఈనెల 25న ఐఎన్‌ఎస్‌ సమేధా ద్వారా 278 మంది స్వదేశానికి చేరుకోగా సీ130జే విమానంలో 121, 135 మంది చొప్పున చేరుకున్నారన్నారు. 26న మరో 297 మంది ఐఎన్‌ఎస్‌ టేగ్‌లో పయనం కాగా సీ130జే 264 మందిని తరలించిందని చెప్పారు. సూడాన్‌లో ఘర్షణ పడుతున్న రెండు వర్గాలతో భారత్‌ సంప్రదింపులు జరుపుతోందని, వారి నుంచి సానుకూల స్పందన లభించిన క్రమంలో పౌరులను సురక్షితంగా తరలిస్తున్నట్లు చెప్పారు. ఖార్టూమ్‌తో అభివృద్ధిపరంగా బలమైన భాగస్వామ్యానికి న్యూదిల్లీ కట్టుబడి ఉన్నదని ఆ వర్గాలకు తెలుసన్నారు. ‘క్షేత్రస్థాయిలో క్లిష్టపరిస్థితులు ఉన్నాయి. తీవ్ర అనిశ్చితి నెలకొంది. సూడానీస్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (ఎస్‌ఏఎఫ్‌), రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)తో సంప్రదింపులు జరుపుతున్నాం. మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు ఆపై పోర్ట్‌ సూడాన్‌కు భారతీయులను తరలించేందుకు అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని క్వాత్రా తెలిపారు. సూడాన్‌లో ఉన్న భారతీయుల్లో మొత్తం 3,100మంది సూడాన్‌ రాజధాని కార్టూమ్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంలో నమోదు చేసుకొన్నట్లు తెలిపారు. మరో 300 మంది దౌత్యకార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడిరచారు. సుమారు 900 నుంచి 1000 మంది వరకు భారత సంతతి ప్రజలు (పీఐఓ) సూడాన్‌లో ఉన్నారన్నారు. ఖార్టూమ్‌, పోర్ట్‌ సూడాన్‌కు మధ్య దూరం 850కిమీలు కాగా బస్సు ప్రయాణం 12 నుంచి 18 గంటలు (పరిస్థితిని బట్టి) పడుతుంది. నావికా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సమేధా, ఐఎన్‌ఎస్‌ టేగ్‌, ఐఎన్‌ఎస్‌ తర్కష్‌తో పాటు వైమానిక దళానికి చెందిన రెండు సీ130జే విమానాల ద్వారా జెడ్డా నుంచి భారతీయులను తరలిస్తున్నారు. జెడ్డా, పోర్ట్‌ సూడాన్‌లో వేర్వేరు కంట్రోల్‌ రూమ్‌లను భారత్‌ ఏర్పాటు చేసింది. 600 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు క్వాత్రా తెలిపారు. ఇంకా 360 మంది జెడ్డా నుంచి చార్టర్డ్‌ విమానంలో న్యూదిల్లీకి చేరుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 495 మంది జెడ్డాలో, 320 మంది పోర్ట్‌ సూడాన్‌లో ఉన్నారని అన్నారు. భారతీయులను పోస్టు సూడాన్‌కు తరలించేందుకు మరిన్ని బస్సులను నడుపుతున్నట్లు వెల్లడిరచారు. భారత సంతతి ప్రజల (పీఐఓ)నూ తరలిస్తారా అన్న ప్రశ్నకు వారు కోరితే తప్పకుండా చేస్తామని క్వాత్రా బదులిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img