అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా అణుసహకారంపై చైనా
బీజింగ్ : అణు జలాంతర్గామి సాంకేతికతపై అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ప్రతిపాదిత సహకారం వల్ల మూడు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)మధ్య 11వ రౌండ్ ఉన్నతస్థాయి వ్యూహాత్మక చర్చలకు ఈయూ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానంపై ఉన్నతస్థాయి ప్రతినిధి జోసెఫ్ బొర్రెల్‌తో కలిసి అధక్షస్థానంలో ఉన్న వాంగ్ మంగళవారం ఓ వీడియో లింక్ ద్వారా ఈమేరకు స్పందించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా త్రైపాక్షిక భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నాయని, అణు జలాంతర్గామి సాంకేతికతపై సహకారం అందించుకునేందుకు ప్రయత్నించాయని వాంగ్ చెప్పారు. ఈ పరిణామంపై అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఈ చర్య ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అంతర్జాతీయ క్రమానికి మూడు రహస్య ప్రమాదాలను తెస్తుందని చైనా విశ్వసిస్తోందని ఆయన అన్నారు. మొదట ఇది ప్రచ్ఛన్న యుద్ధం పునరుద్ధరణకు దారి తీస్తుందన్నారు. మూడు దేశాలు సైద్ధాంతిక దృక్పథాలను రూపొందించి, కొత్త సైనిక బ్లాక్‌ను నిర్మించాయని, ఇది భౌగోళిక ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తుందని పేర్కొన్నారు. రెండవది, ఆయుధ పోటీని పెంచుతుంది. కొన్ని ప్రాంతీయ దేశాలు తమ సైనిక శక్తిని పెంచు కోవడం ద్వారా సైనిక ఘర్షణలు చోటుచేసుకుంటాయి. మూడవది, అణుకార్యక్రమ విస్తరణ.. ఇది అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దక్షిణ పసిఫిక్ అణురహిత ఒప్పందాన్ని దెబ్బతీయడమే కాక ఈ ప్రాంతంలో అణు రహిత జోన్ స్థాపించడానికి ఆసియాన్ దేశాల ప్రయత్నాలను కూడా ప్రభావితం చేస్తుందని వాంగ్ వివరించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని తాము మూడు దేశాలను కోరుతున్నామని ఆయన చెప్పారు.