మినీ బస్సును ఢీకొట్టిన రైలు `11 మంది దుర్మరణం
మృతుల్లో నలుగురు టీచర్లు, ఆరుగురు విద్యార్థులు
చిట్టగాంగ్ : బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న ఒక రైలు.. క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న పాఠ శాలకు చెందిన మినీ బస్సును ఢీకొట్టింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిట్టగాంగ్‌లోని మిర్షారాయ్`బారాటకియా రైల్వేస్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రైల్వే క్రాసింగ్ వద్ద కాపలా లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మహానగర్-ప్రోవతి ఎక్స్‌ప్రెస్ రైలు ఈ మినీబస్సును దాదాపు 500 మీటర్లు ఈడ్చుకొని వెళ్లిందని, ప్రమాదం జరిగినప్పుడు అందులో 17 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో నలుగురు టీచర్లు, ఆరుగురు విద్యార్థులు, డ్రైవర్ ఉన్నట్లు వెల్లడిరచారు. వీరంతా ఖోయచోరా వాటర్ ఫాల్స్‌కి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రైల్వే క్రాసింగ్ గేట్మెన్ సద్దాం హుస్సేన్‌పై కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో వివిధ లెవల్ క్రాసింగ్‌ల వద్ద జరిగిన 4,914 రైలు ప్రమాదాల్లో 400 మందికి పైగా మరణించారని, రెండు వేల మందికి పైగా గాయపడ్డారని రైల్వే డేటా చెబుతోంది.