బ్రసీలియా: కోవిడ్`19 నకిలీ వాక్సిన్ కార్డుల జారీ వ్యవహారంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో నివాసాన్ని ఫెడరల్ పోలీసులు సోదా చేశారు. ఆయన అనుచరులు, నమ్మకస్తుల ఆస్తులనూ తనిఖీ చేశారు. బోల్సనారో సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోవిడ్ టీకా తీసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన బోల్సనారో వాక్సిన్ తీసుకున్నట్లు ఫిబ్రవరిలో బహిర్గతం చేసిన రికార్డుల్లో ఉండటాన్ని దర్యాప్తు అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. బోల్సనారో వాక్సిన్ రికార్డుల టాంపరింగ్ జరిగినట్లు పోలీసులకు ఆధారాలు లభించడాన్ని సుప్రీంకోర్టు పత్రాలు సూచించాయి. బోల్సనారో గత డిసెంబరులో అమెరికాకు వెళ్లే ముందు ఈ అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. అయితే తన ఇంటిలో సోదాలను బోల్సనారో ధ్రువీకరించారు. ఆయన బ్రసీలియాలో విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ వాక్సిన్ తీసుకోలేదని పునరుద్ఘాటించారు.
కోవిడ్ టీకాకు సంబంధించి నకిలీ పత్రాల జారీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘నేను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. నేను వాక్సిన్ తీసుకోలేదు’ అని చెప్పారు. తన ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారన్నారు. ‘డిజిటల్ మిలీసియాస్’ దర్యాప్తు క్రమంలో మంత్రి అలగ్జాండ్రే డే మోరేస్ అధ్వర్యంలో ఆపరేషన్ వెనైర్‌లో భాగంగా బోల్సనారో ఇంటిని సోదా చేసినట్లు ఏజెన్సీయా బ్రెజిల్ పేర్కొంది. 16 తనిఖీ, స్వాధీనాల వారెంట్లు, ఆరు ముందస్తు అరెస్టుల వారెంట్లను బ్రసీలియా, రియోడి జనేరియాలో జారీచేసినట్లు వెల్లడిరచింది.