నిశ్శబ్దంగా ఉంటే మంచిది
హసీనాకు యూనస్ తీవ్ర హెచ్చరిక
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో కూర్చొని రాజకీయ ప్రకటనలు చేయరాదని… మౌనంగా ఉంటే మంచిదని… ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ హెచ్చరించారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు… ఆమె భారత్‌లో మౌనంగా ఉండాలన్నారు. ఈ మేరకు రాజధాని ఢాకాలో తన అధికారిక నివాసంలో యూనస్ పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘హసీనాను తిరిగి స్వదేశానికి పంపాలని బంగ్లాదేశ్ అడిగే వరకు ఆమె భారత్‌లోనే ఉండిపోతే….మౌనంగా ఉండాలి. ఆమె అక్కడ ఉండి మాట్లాడటం ఇబ్బందిగా మారుతుంది. ఆమె మౌనంగా ఉంటే మేం దానిని మర్చిపోతాం. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సూచనలు చేయడాన్ని ఎవరూ ఇష్టపడరు. దేశంలో దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉంది. న్యాయం జరగాలంటే తిరిగి ఆమెను వెనక్కి తీసుకురావాలి. లేకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరు. ఆమె పాల్పడిన దురాగతాలను అందరి ముందు విచారించాల్సిందే’’ అని యూనస్ అన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు రాజకీయ కారణంగానే జరుగుతున్నాయని యూనస్ తెలిపారు. అందులో మతతత్వ కోణం లేదని పేర్కొన్నారు. భారత్‌లో ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హిందువులు రాజకీయంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌కు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం ఉండటం వల్ల కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పినట్లు మహమ్మద్ యూనస్ వెల్లడిరచారు. అలాగే భారత్‌తో సంబంధాల గురించి యూనస్ మాట్లాడారు. తాము భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్‌లో స్థిరత్వం ఉంటుందనే ధోరణిని భారత్ విడనాడాలంటూ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా కొన్నిరోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న హసీనా… కొన్నిరోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ‘‘ఇటీవల కాలంలో ఆందోళనల పేరిట కొంతమంది విధ్వంసానికి దిగారు. హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈనెల 15న బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాను. అదేవిధంగా.. ఇటీవల హత్యలు, విధ్వంస చర్యలకు పాల్పడినవారిని గుర్తించి, తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. కాగా షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా, లేదా అని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్‌ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తంచేశారు. హసీనాను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని ఆయన వ్యాఖ్యానించిన సంగతి విదితమే.