గ్రీస్ ప్రధాని మిట్సోటకీస్ ప్రకటన
ఏథెన్స్: గ్రీస్ సార్వత్రిక ఎన్నికలు మే 21వ తేదీన జరగనున్నట్లు ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిట్సోటాకిస్ ప్రకటించారు. ‘దేశానికి, పౌరులకు స్పష్టత అవసరం. మేము మరింత ధైర్యంగా, రాజీపడకుండా పనిచేస్తాం’ అని కేబినెట్ సమావేశం ప్రత్యక్ష ప్రసారంలో ప్రధాని తెలిపారు. న్యూ డెమొక్రసీ విజయం తథ్యమని దీమా వ్యక్తంచేశారు. ఆధునిక సవాళ్లను అధిగమించేందుకు గ్రీక్ మహిళలు, పురుషులకు మే 21న తమ ఓటు హక్కును సద్వినియోగించుకొని సమర్థ పాలకులను ఎన్నుకునే అవకాశం లభిస్తుందని ఆయనన్నారు. దేశంలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తర్వాత అధికార పార్టీకి ప్రజాదరణ తగ్గింది. ఈ మేరకు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడి అయింది. ఫిబ్రవరి 28న రెండు రైళ్లు ఢీకొన్నఘటనలో 57 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు దుయ్యబట్టారు. దీంతో కన్జర్వేటివ్ న్యూ డెమొక్రసీ పార్టీ మద్దతు సగమైంది. ఈ పరిణామాలతో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అధికార పక్షానికి ప్రతిష్టాత్మకంగా మారింది.