35 మంది మృతి, 105 మందికి గాయాలు
మాస్కో : దక్షిణ రష్యా ప్రావిన్సులు డాగేస్థాన్ రాజధాని మఖచ్కల నగరంలోని ఓ పెట్రోల్ కేంద్రంలో పేలుడు సంభవించింది. 35 మంది మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఉండగా గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ఫస్ట్ డిప్యూటీ విక్టర్ ఫిసెక్కో మంగళవారం వెల్లడిరచారు. గాయపడిన వారిని మఖచ్కలలోని మెడికిల్ ఇనిస్టిట్యూట్‌లకు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగిందని, దీనికిగల కారణాలు తెలియలేదన్నారు. ప్రతి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో వైద్యులు ఉన్నట్లు చెప్పారు. కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఈ నగరంలో జాతీయ రహదారిపై ఉన్న కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో తొలుత మంటలు చెలరేగాయి. అవి క్రమంగా ఎదురుగా ఉన్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌కు వ్యాపించగా భారీ పేలుడు సంభవించింది. ఉవ్వెత్తున మంటల ఎగిసిపడి పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రమాదంపై తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 260 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అనేక కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. గాయపడిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంటలు ఏకంగా 6,460 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించాయని కారు మరమ్మత్తు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగి ఎదురుగా ఉన్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌కు వ్యాపించినట్టు రష్యా దర్యాప్తు కమిటీ పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.