Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

సహకారాన్ని పెంచుకుందాం

రష్యా ప్రధానితో భేటీలో జిన్‌పింగ్‌
బీజింగ్‌ : తమ రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్ఠపర్చుకుందామని, అనేక రంగాల్లో సహకారాన్ని పెంచుకుందామని రష్యా ప్రధాని మైఖెల్‌ మిషుస్టిన్‌తో భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. చైనా, రష్యా మధ్య ఆధునిక సహకారాన్ని విస్తరించాలని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకోగలమని ఆయన ఆకాంక్షించారు. రెండు దేశాలకు ప్రయోజనకరమైన అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని, బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సంఘం, బ్రిక్స్‌, జీ20 గురించి జిన్‌పింగ్‌ ప్రస్తావించారు. ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడుల సహకారంతో పాటు ద్వైపాక్షిక సయోధ్యను మెరుగుపర్చుకోవాలని, ఇంధన పరిధిని విస్తరించుకోవాలని, కొత్త వృద్ధి కేంద్రాలను సృష్టించుకోవాలని అన్నారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌, యురేసియన్‌ ఎకనామిక్‌ యూనియన్‌ ప్రయోజనాల కోసం రష్యాతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాంతీయ విపణి విస్తరణ, సుస్థిరత, అంతర్జాతీయ పారిశ్రామిక, సరఫరా గొలుసులు వంటివి సాధించడం ద్వారా రెండు దేశాలకు లబ్ధి చేకూర్చుదామని రష్యా ప్రధానితో జిన్‌పింగ్‌ అన్నారు. అధికారికంగా చైనాలో పర్యటిస్తున్న మైఖెల్‌ మిషుస్టిన్‌ తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తరపున జిన్‌పింగ్‌కు శుభాభినందనలు తెలిపారు. మార్చిలో రష్యాలో జిన్‌పింగ్‌ చరిత్రాత్మక పర్యటన విజయవంతం అయిందని అన్నారు. రష్యా, చైనా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త తరానికి నాంది పలికినట్లు అభివర్ణించారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు, చైనాతో కలిసి పనిచేసేందుకు రష్యా సిద్ధమేనని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img