ఢాకా: బంగ్లాదేశ్ అల్లకల్లోలం వెనుక అమెరికా హస్తం ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. గతంలో మాజీ ప్రధాని షేక్ హసీనా స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ అగ్రరాజ్యం నుంచి ఒత్తిడి వచ్చినట్లు బాంబు పేల్చారు. దీంతో సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఏమిటీ? వ్యూహాత్మకంగా దానికి ఉన్న ప్రాధాన్యం ఎంత అనే అంశం చర్చనీయాంశంగా మారింది. బంగాళా ఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఉంది. ఇది ఒక పగడపు దీవి. బంగ్లాదేశ్ దక్షిణ భాగంలో ఉన్న కాక్స్ బజార్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. స్థానికులు దీనిని నారీకేళ్ జింజిరా లేదా కోకోనట్ ఐలాండ్ అని అంటారు. ఈ దీవిలో 3,700 మంది ప్రజలు నివాసం ఉన్నారు. వీరంతా చేపలవేట, వరి సాగు, కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తు న్నారు. సీవీడ్ సాగుకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. దీనిని మైన్మార్‌కు ఎగుమతి చేస్తారు. 18వ శతాబ్ధంలో ఇక్కడ అరబ్ వర్తకులు స్థిరపడ్డారు. వారు దీనికి జజిరా అనే పేరు పెట్టారు. 1900ల్లో ఈ ద్వీపాన్ని బ్రిటీష్ వారు తమ భారత రాజ్యంలో భాగం చేసుకొ న్నారు. క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్స్ పేరు పెట్టినట్లు ప్రచారంలో ఉంది. మరోవైపు నాటి చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనర్ గౌరవార్థం మార్టిన్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. 1947లో భారత్ విడిపోయిన తర్వాత ఇది తూర్పు పాకిస్థాన్‌లో భాగమైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌కు దక్కింది. 1974లో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మైన్మార్ ఒప్పందం చేసుకొంది. ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు పూర్తి కాలేదు. దీంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ మత్స్యకారుల పడవలపై మైన్మార్ దళాలు కాల్పులు జరపడం పరిపాటిగా మారింది. మైన్మార్‌లో సైన్యం రోహింగ్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడటంతో లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు. వీరంతా కాక్స్‌బజార్ సమీపంలోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకొన్నారు. వీరికి మద్దతుగా ఉండే అరకాన్ ఆర్మీ ఇటీవల కాలంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై హక్కును ప్రకటించుకుంది. కానీ, బంగ్లాదేశ్ ప్రభుత్వం దానిని తోసిపు చ్చింది. మరోవైపు అరకాన్ ఆర్మీ కారణంగా ఈ ద్వీపంపై తరచూ మైన్మార్ దళాలు కాల్పులు జరుపుతుం టాయి. దీంతో బంగ్లాదేశ్ తమ నౌకాదళాన్ని ఇక్కడ మోహరించింది. ఇది బంగాళా ఖాతంలో అనేక దేశాల మధ్యలో ఉండటంతో అమెరికా దృష్టి దీనిపై ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ అమెరికా సైనిక స్థావరం నిర్మిస్తే… ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుంది. ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా అధికారి కంగా చెప్పినప్పటికీ ఇక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా ప్రయత్నాలు చేసింది. దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది. అందువల్ల ఈ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. దీంతోపాటు ఏకకాలంలో ఇక్కడి నుంచి చైనా, మైన్మార్‌పై నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తుంది.