ప్రాదేశిక యుద్ధానికి ప్రజలే మూల్యం చెల్లించుకోవాలి: ఇజ్రాయిల్ కమ్యూనిస్టులు
టెల్‌అవీవ్: నెతన్యాహు ప్రభుత్వం వల్ల మొదలైన ప్రాదేశిక యుద్ధానికి స్థానిక ప్రజలు బలవుతున్నారని ఇజ్రాయిల్ కమ్యూనిస్టులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేశారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయిల్ జరిపిన తాజా దాడితో పాటు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్యను ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీ (మాకీ), హదాష్ (డెమొక్రటిక్ ఫ్రంట్ ఫర్ పీస్ అండ్ ఈక్వాలిటీ) ఖండిరచాయి. ‘ఇజ్రాయిల్ ప్రభుత్వ రగిల్చిన చిచ్చుతో ఇజ్రాయిల్ పౌరులతో పాటు ఆ ప్రాంత ప్రజలంతా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇజ్రాయిల్‌లోని సెట్లర్ ప్రభుత్వం… ప్రాంతీయ యుద్ధాన్ని మరింత విస్తరింపజేస్తోంది. ఇది ప్రాంతీయ వినాశనానికి దారితీస్తోంది’ అని పేర్కొన్నాయి. అమెరికా అండ లేకుంటే రిస్క్ తీసుకునే ఏ పనిని చేసేందుకు ఇజ్రాయిల్ సాహసించబోదని వ్యాఖ్యానించాయి. అమెరికా కాంగ్రెస్‌లో నెతన్యాహుకు లభించిన స్వాగతంతో ఆ దేశాల తీరు స్పష్టమైందని పేర్కొన్నాయి. యుద్ధ ఉద్దేశాలను నెరవేర్చడంలో ఇజ్రాయిల్ ప్రభుత్వ వైఫల్యానికి తాజా హత్యలు అద్దంపట్టాయని విమర్శించాయి. యుద్ధాన్ని ముగించేందుకు, బందీలు`ఖైదీల విడుదలకు, గాజా పున:నిర్మాణం, ఉత్తర ఇజ్రాయిల్ ప్రజలు తిరిగి వాళ్ల ఇంటికి చేరుకోవడానికి ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని సూచిస్తున్నాయని ఇజ్రాయిల్ కమ్యూనిస్టులు దుయ్యబట్టారు. దౌత్యానికి విరుద్ధంగా హత్యాకాండను ఇజ్రాయిల్ సాగిస్తోందని, హింస, విధ్వంసమే నెతన్యాహు ప్రభుత్వానికి తెలిసిన భాష అని వ్యాఖ్యానించారు.