Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అఫ్గాన్‌ల దయనీయస్థితి

ఆకలితో అలమటిస్తున్న ప్రజలు
తీవ్రంగా వేధిస్తున్న నగదు కొరత
తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్మకం

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌లో పేదరికం అక్కడి ప్రజలతో ఆటలాడుకుంటున్నది. అఫ్ఘాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ పౌరులు జీవించడం చాలా కష్టంగా మారింది. నగదు కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ప్రజలు రెండు పూటలు భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కళ్ల్ల ముందే చిన్నారులు ఆకలి కోసం ఏడుస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పెద్దవాళ్లు ఉంటున్నారు. ఏదైనా పనిచేసి సంపాదిద్దాం అనుకుంటే ఏమీ పనులు దొరకడం లేదని అనేకమంది కన్నీరుమున్నీరవుతున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడం, ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆహారం కోసం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను విక్రయిస్తున్నారు. అనేక మంది రోడ్లపై తమ ఇంటి వస్తువులను అమ్మకానికి పెట్టిన తీరు అక్కడి పేదరికానికి అద్దంపడుతున్నది. కార్బెట్‌లోని చమన్‌-ఇ-హోజోరి పార్కుకు వెళ్లే రహదారిపై తివాచీలు, ఫ్రిజ్‌, టెలివిజన్‌, సోఫాలతో పాటు అనేక గృహోపకరణాలు అమ్మకానికి పెట్టారు. ప్రజలు తమ కుటుంబాల కోసం రేషన్‌ సరుకులు తెచ్చుకోవడానికి తాగునీటిని కూడా విక్రయిస్తున్నారు. ఇంట్లో వారి ఆకలి తీర్చేందుకు రూ.25 వేల విలువైన ఫ్రీజ్‌ను రూ.5 వేలకు అమ్మకానికి పెట్టానని లాల్‌ గుల్‌ అనే వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పిల్లల కడుపు నింపేందుకు ఇలా కాకుండా తన వద్ద మరో మార్గం లేదని ఆయన చెప్పారు. కొందరు ఆకలి కోసం ఇంటి వస్తువులను అమ్మకానికి పెట్టగా.. మరికొందరేమో అఫ్ఘాన్‌ వదిలివెళ్లేందుకు కావాల్సిన డబ్బు కోసం వస్తువులను అమ్ముతున్నారు. ‘‘నేను, నా కుమారుడు ఇద్దరం నిరుద్యోగులం. తినడానికి డబ్బు కోసం వస్తువులను అమ్మకానికి ఉంచాం’’ అని కాబూల్‌ నివాసి ఒకరు తన గోడు వెళ్లబోసుకున్నాడు. జీతం లేకపోవడంతో గత 10 రోజులుగా మార్కెట్లో పనిచేస్తున్నానని పోలీస్‌ అధికారి మహమ్మద్‌ ఆఘా చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img