Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అల్‌ జవహరీ మృతిపై డీఎన్‌ఏ ఆధారాల్లేవ్‌.. కానీ అలా నిర్ధారించాం…

వైట్‌ హౌస్‌ షాకింగ్‌ ప్రకటన
ఒకప్పుడు అమెరికాను గడగడలాడిరచిన సెప్టెంబర్‌ 11 దాడుల సూత్రధారుల్లో ఒకరైన అల్‌ ఖైదా నేత అయ్‌ మన్‌ అల్‌ జవహరీని ఆప్ఘనిస్తాన్‌ లోని కాబూల్లో డ్రోన్‌ దాడితో మట్టుబెట్టిన అమెరికా ఇప్పుడు దీనిపై సంచలన ప్రకటన చేసింది. తాము చంపింది అల్‌ జవహరీనా కాదా అనే దానిపై క్లారిటీ లేదనే అర్ధం వచ్చేలా వైట్‌ హౌస్‌ చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో వైట్‌ హౌస్‌ ప్రకటన దేశవిదేశాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఆప్ఘనిస్తాన్‌ లోని కాబూల్‌ లో ఓ ఇంట్లో దాక్కున అల్‌ ఖైదా అగ్రనేత అల్‌ జవహరీని అమెరికా డ్రోన్‌ దాడితో హతమార్చింది. ఆరునెలలుగా పక్కాగా ప్లాన్‌ చేసి మరీ హతమార్చినట్లు మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అంతేకాదు అల్‌ జవహరీ హత్యకు సీఐఏ వాడిన వ్యూహం, ఆయుధాలు అమెరికా సత్తాకు నిదర్శనంగా ప్రచారం జరిగింది. దీంతోపాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం అల్‌ జవహరీ హత్యను నిర్ధారిస్తూ ప్రకటన కూడా చేశారు. అదే సమయంలో తాలిబన్లు కూడా ఈ వ్యవహారంపై అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎన్‌ఏ ఆధారాల్లేవన్న వైట్‌ హౌస్‌
సెంట్రల్‌ కాబూల్‌లో అల్‌ ఖైదా నేత అయ్‌ మాన్‌ అల్‌-జవహరి మరణానికి సంబంధించిన డీఎన్‌ఏ ధృవీకరణ తమ వద్ద లేదని వైట్‌ హౌస్‌ చావు కబురు చల్లగా చెప్పింది. తమ వద్ద జవహరీ డీఎన్‌ఏ లేదని, కానీ చనిపోయింది అల్‌ జవహరీనే అని వైట్‌ హౌస్‌ ప్రకటన తెలిపింది. దీంతో అగ్రదేశం ఎలాంటి డీఎన్‌ఏ నిర్ధారణ చేసుకోకుండానే చనిపోయింది అల్‌ జవహరీ అని ప్రకటించిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో అల్‌ జవహరీ హత్యను యూఎస్‌ ఎలా నిర్ధారించిందన్న చర్చ కూడా మొదలైంది. దీనిపైనా వైట్‌ హౌస్‌ క్లారిటీ ఇచ్చింది.
సెంట్రల్‌ కాబూల్లోని భవనంలో తమ డ్రోన్‌ దాడిలో చనిపోయింది అల్‌ జవహరీయే అన్న విషయాన్ని తాము ఇతర మార్గాల ద్వారా నిర్ధారించుకున్నట్లు వైట్‌ హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అవి ఏవన్నది మాత్రం చెప్పలేదు. దీంతో అల్‌ జవహరీ హత్యను నిర్ధారించే కచ్చితమైన ఆధారాలు కూడా అమెరికా వద్ద ఉన్నాయా లేదా అన్నది తేలడం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img