Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సాయం

రష్యాపై మరిన్ని ఆంక్షలకు జీ7 దేశాల సంకల్పం
హిరోషిమాలో సదస్సుకు నిరసన సెగ

టెహ్రాన్‌/హిరోషిమా: ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సాయాన్ని మరింతగా అందించేందుకు జీ7 దేశాలు సంకల్పించాయి. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వంపై రష్యా అక్రమ దాడులను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నామని తెలిపాయి. ఉక్రెయిన్‌కు ఆర్థికంగానే కాకుండా సైనిక, ఆయుధ, దౌత్య, మానవతా సాయాన్ని సుదీర్ఘకాలం వరకు అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని రష్యాకు జీ7 దేశాలు హితవు పలికాయి. రష్యా సైన్యం వెనక్కి వెళ్లకుండా శాంతి నెలకొల్పడం సాధ్యం కాదని పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ శాంతి ఫార్ములాకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. యుద్ధ సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక పరికరాలు, సేవలపై మరిన్ని కఠిన ఆంక్షలను విధిస్తున్నట్లు వెల్లడిరచాయి.. ఇదిలావుంటే, రష్యా, ఇతర దేశాలకు చెందిన మరో 70 సంస్థలను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నట్లు అమెరికా సీనియర్‌ ప్రభుత్వాధికారి వెల్లడిరచారు. రష్యాతో జరిగే వజ్రాల వ్యాపారాన్ని బ్రిటన్‌ లక్ష్యంగా చేసుకుంది. రాగి, అల్యూమినియం, నికెల్‌తో పాటూ రత్నాల దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది. రష్యాలో లభించే, తయారయ్యే వజ్రాలను వినియోగించడం, వాటి వ్యాపారం ఆంక్షలు విధిస్తున్నట్లు జీ7 ప్రకటన పేర్కొంది. జీ7శిఖరాగ్ర సదస్సు జపాన్‌, హిరోషిమాలో శుక్రవారం మొదలైంది. అయితే ఈ సదస్సును నిరసన సెగ తాకింది. జీ7కు వ్యతిరేకంగా హిరోషిమాలో వేలాదిమంది ఆందోళనకు దిగారు. సదస్సు వేదిక వద్దనున్న శాంతి పార్క్‌కు చేరుకొని ‘చెత్త జీ7’, ‘యుద్ధాన్ని పురిగొల్పవద్దు’, ‘జపాన్‌-అమెరికా సైనిక పొత్తు వద్దు’ అన్న ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘అమెరికా సామ్రాజ్యవాదులు, నంబర్‌ వన్‌ టెర్రరిస్ట్‌’, అసత్యాలు ఆపండి, యుద్ధాన్ని ఆపండి, క్వాడ్‌ కూటమి వద్దు, నాటో కూటమి వద్దు’ అని నినాదాలు చేశారు. హిరోషిమాతో సహా జపాన్‌లో అనేక నగరాల్లో నిరసనలు, ర్యాలీలు జరిగాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన వారు వీధుల్లోకి వచ్చి జీ7కి వ్యతిరేకంగా నినదించారు.
అణ్వాస్త్రాలు రహిత ప్రపంచమే లక్ష్యం: బైడెన్‌
అణ్వాస్త్రాలు రహిత ప్రపంచాన్ని సృష్టించేందుకు చేయగలిగినదంతా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉద్ఘాటించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయం…1945లో అమెరికా అణుబాంబు దాడివల్ల జరిగిన వినాశనాన్ని కళ్లకుకట్టే హిరోషిమాలోని పీస్‌ మెమోరియల్‌ మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. గతంలో బరాక్‌ ఒబామా మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా హిరోషిమా గడ్డపై అడుగు పెట్టారు. బైడెన్‌తో పాటు బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర అణుశక్తి దేశాధినేతలు కూడా ఈ మ్యూజియాన్ని సందర్శించారు. ‘శాంతితో కూడిన భవిష్యత్‌ నిర్మాణానికి ఎంతగా కట్టుబడాలన్నది ఈ మ్యూజియం చెప్పే గాథలు మనకు గుర్తుచేస్తాయి’ అని అతిథుల పుస్తకంలో బైడెన్‌ రాశారు. ‘అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సృష్టించేందుకు కలిసికట్టుగా ప్రయత్నిద్దాం’ అని జీ7దేశాలకు పిలుపునిచ్చారు.
ఉక్రెయిన్‌కు 375 మిలియన్‌ డాలర్ల ప్యాకేజి
ఉక్రెయిన్‌కు 375 మిలియన్‌ డాలర్ల ఆర్థికప్యాకేజిని బైడెన్‌ ప్రకటించారు. ఈ ప్యాకేజిలో భాగంగా ఆయుధాలు, సాయుధ వాహనాలు, యాంటీ ట్యాంక్‌ అస్త్రాలు తదితరాలు ఉన్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img