Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉచితాల పేరుతో సంక్షేమానికి ఎసరు పెట్టే కుట్ర

బీజేపీ పాలన తీరుపై డీహెచ్‌పీఎస్‌ ఆగ్రహం
విశాలాంధ్ర`శ్రీకాకుళం కలెక్టరేట్‌ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంక్షేమానికి ఉచితాలు అనే పేరు పెట్టి పేదలకు అన్యాయం చేయాలని చూస్తోందని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు అన్నారు. మంగళవారం ఎన్‌ఆర్‌దాసరి క్రాంతి భవనంలో నిర్వహించిన డీహెచ్‌పీఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని రాజ్యాంగంగా ఆమోదింపజేసే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. దేశంలోని దళితుల హక్కులను హరిస్తోందని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలను ఎత్తి వేసేలా పావులు కదుపుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరు పెట్టి కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సీఎం జగన్‌ నవరత్నాలు అందిస్తున్నామనే పేరుతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇస్తున్న 28 సంక్షేమ పథకాలను నిలిపివేయడం అన్యాయమని అన్నారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా,రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసం ఉద్యమాలను ఉధృతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ…విజయవాడలో అక్టోబరు 14 నుంచి 18 వ తేది వరకూ జరిగే సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షులు పాల పోలారావు అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు చిక్కాల గోవిందరావు, ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖ రావు, నేతలు బలగ రామారావు, జామాన రామారావు, సామ హిరణ్య రావు, చిట్టి సింహాచలం, ముంజేటి రాము, ఉంకిలి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img