Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎట్టకేలకు సిద్ధిక్‌ కప్పన్‌కు బెయిల్‌

28 నెలల తర్వాత జైలు నుంచి విడుదల

లక్నో: కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్టు సిద్ధిక్‌ కప్పన్‌ ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. తన బెయిల్‌ కోసం అవసరమైన పూచీకత్తులను కోర్టులో సమర్పించిన ఒక రోజు తర్వాత, గురువారం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఉదయం 9.15 గంటలకు కప్పన్‌ జైలు నుంచి విడుదలయ్యారని లక్నో జిల్లా జైలు జైలర్‌ రాజేంద్ర సింగ్‌ పీటీఐకి తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కప్పన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘28 నెలలు అయ్యింది. చాలా గొడవల తర్వాత బయటకి వచ్చాను. హ్యాపీగా ఉన్నాను’ అన్నారు. హత్రాస్‌కు వెళ్లిన ఉద్దేశం గురించి అడగ్గా తాను రిపోర్టింగ్‌ కోసం అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. తనతో పాటు వచ్చిన వారు విద్యార్థులన్నారు. మీ వద్ద పోలీసులు ఏం స్వాధీనం చేసుకున్నారని అడగ్గా… ‘ఏమీ లేదు… నా దగ్గర ల్యాప్‌టాప్‌, మొబైల్‌ మాత్రమే ఉన్నాయి. రెండు పెన్నులు, నోట్‌ప్యాడ్‌ ఉన్నాయి అవే తీసుకున్నారు’ అని చెప్పారు. తనపై పోలీసులు మోపిన అభియోగాలేవీ నిరూపణ కాలేదని, తనకు అండగా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తనపై అక్రమంగా పెట్టిన కేసుల నుంచి విముక్తి లభించడంపై కప్పన్‌ సంతోషం వ్యక్తం చేశారు. యూపీలోని హత్రాస్‌ లో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని కలిసేందుకు ఆ గ్రామానికి వెళ్తున్న కప్పన్‌, మరో ముగ్గురిని అక్టోబర్‌ 2020లో పోలీసులు అరెస్టు చేశారు. కప్పన్‌ ఇప్పుడు నిషేధంలో ఉన్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతో సంబంధాలు కలిగి ఉన్నాడని, హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన అకృత్యంపై హింసను ప్రేరేపించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. అయితే ఆయనపై యూపీ పోలీసుల అభియోగాల్ని అనేక సార్లు కోర్టులు తప్పుబట్టాయి. ఆ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన మనీలాండరింగ్‌ కేసు కారణంగా ఆయన జైలులో కొనసాగారు. 28నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయనకు బెయిల్‌ లభించినా వెంటనే విడుదల చేయలేదు. ఎట్టకేలకు ఆయనకు విముక్తి లభించింది. అసలేం జరిగిందంటే… 2020 అక్టోబరులో యూపీలోని హత్రాస్‌లో ఓ దళిత యువతిపై అత్యాచారం చేసిన కామాంధులు… ఆ తర్వాత ఆమెను కుటుంబసభ్యులు అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా తగులబెట్టారు. దీన్ని కప్పిపుచ్చేందుకు యూపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో దిల్లీలో ఉంటున్న కేరళ జర్నలిస్టు యూనియన్‌ నేత సిద్ధిక్‌ కప్పన్‌ వెంటనే హత్రాస్‌ కు బయలుదేరారు. దీంతో విషయం తెలిసిన యూపీ పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్టు చేశారు. అంతే కాదు ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అనేక కేసులు నమోదు చేశారు. ఆయనకు తీవ్రవాదుల నుంచి నిధులు అందుతున్నట్లు ఆరోపించారు. చివరికి ఈ ఆరోపణలేవీ కోర్టుల్లో నిలబడలేదు. తాజాగా సిద్ధిక్‌ కప్పన్‌కు బెయిల్‌ లభించడంతో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన యూపీలోని లక్నో జైలు నుంచి విడుదలయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img