Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కాబూల్‌పై డ్రోన్‌ దాడి తప్పే

అంగీకరించిన అమెరికా
వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో గత నెల 29న జరిపిన డ్రోన్‌ దాడికి సంబంధించి అమెరికా ఎట్టకేలకు తప్పు అంగీకరించింది. నాటి దాడిలో కేవలం సాధారణ ప్రజలే చనిపోయారని అంగీకరించింది. తమ అంతర్గత సమీక్షలో ఈ మేరకు వాస్తవాలు వెల్లడయ్యాయని శుక్రవారం పేర్కొంది. కాబుల్‌ విమానాశ్రయం వైపు పేలుడు పదార్థాలతో దూసుకొస్తున్న వాహనంపై తాము డ్రోన్‌ దాడి చేశామని.. అందులో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాది హతమయ్యాడని అమెరికా బలగాలు ఇంతకుముందు పేర్కొన్నాయి. ఆ దాడిలో చిన్నారులు సహా సాధారణ పౌరులే ప్రాణాలు కోల్పోయారన్న వార్తలను ఇప్పటి వరకు నిరాకరించాయి. అమెరికా బలగాలు అఫ్గాన్‌ గడ్డ నుంచి పూర్తిగా నిష్క్రమించడానికి ముందు కాబుల్‌ విమానాశ్రయం వద్ద ఐసిస్‌-కె ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో వంద మందికి పైగా చనిపోయారు. ఆ తర్వాత మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని నిఘా సమాచారం భయపెట్టింది. దీంతో ఉగ్రముప్పును అణచివేసేందుకు అమెరికా సైన్యం అప్రమత్తంగా వ్యవహరించింది. ఈ క్రమంలో సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న కారును ఉగ్రవాదుల వాహనంగా అంచనా వేసి డ్రోన్‌ దాడికి పాల్పడిరది. దీంట్లో పది మంది చనిపోగా.. వారిలో ఏడుగురు చిన్నారులే. తాజాగా తమ తప్పుని అంగీకరించిన సెంట్రల్‌ కమాండ్‌ కమాండర్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకెంజీ క్షమాపణలు కోరారు. ఆ రోజున్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యానే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద ప్రమాదాన్ని తప్పించాలన్న తొందరలోనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ తప్పునకు తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలను సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img