Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చైనా, ఉ.కొరియా మైత్రికి 60 ఏళ్లు

సంబంధాల బలోపేతానికి అధినేతల ప్రతిజ్ఞ
సియోల్‌ : చైనా, ఉత్తర కొరియా మైత్రికి 60ఏళ్లు నిండాయి. ఆరు దశకాల తమ బంధాన్ని మరింత పటిష్టపర్చుకోవాలని కొత్త స్థాయికి తీసుకు వెళ్లాలని ఇరు దేశాధినేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఆదివారం ప్యాంగ్యాంగ్‌ మీడియా పేర్కొంది. ఉత్తర కొరియాకు దీర్ఘకాల మిత్రదేశంగా చైనా ఉంది. మావో జెడాంగ్‌ కాలంలో జరిగిన కొరియా యుద్ధంతో ‘రక్తపు’ బంధం పదిలమైంది. మిలియన్ల వలంటీర్లను అమెరికా నేతృత్వ ఐరాస దళాలపై యుద్ధానికి జెడాంగ్‌ పంపారు. 1961, జులై 11న సాయుధ దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య స్నేహం, సహకారం, పరస్పర సహాయ ఒప్పందం జరిగింది. తమ బంధం పెదాలు, పళ్ల వంటిదని మావో జెడాంగ్‌ అప్పట్లో అభివర్ణించారు. ప్యాంగ్యాంగ్‌ అణుశక్తి పెంపోదించుకునే నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీట్లు వారాయి. కానీ ఉత్తర కొరియా, అమెరికా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. తాజా అంతర్జాతీయ పరిస్థితులు జఠిలంగా మారిన నేపథ్యంలో డీపీఆర్‌కే, చైనా మధ్య బంధం రోజురోజుకూ బలపడుతోంది. ఇదే విషయాన్ని 60ఏళ్ల మైత్రిని వేడుక చేసుకునే క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు పంపిన లేఖలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రస్తావించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్‌ కూడా కిమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 1961లో ఇరు దేశాల నేతలు భవిష్యత్‌ దృష్ట్యా వ్యూహాత్మకంగా ఆలోచించి ఈ ఒప్పందం చేసుకున్నట్లు తన సందేశంలో జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. మైత్రిసహకార ఒప్పందానికి కట్టుబడి ఉందామని, తమ మధ్య స్నేహంసయోధ్యను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. ప్రపంచ శాంతి, సుస్థిరతతో పాటు ప్రాదేశిక పరిరక్షణ దిశగా సోషలిస్టు కారణాలను మరింత మెరుగుపర్చుకోవాలని అన్నారు. చైనా`డీపీఆర్‌కే మైత్రి కొత్త శకం మొదలైందని, గతంలో ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తామిద్దరం అనేకమార్లు భేటీ అయి వరుస ఏకాభిప్రాయాలతో ముందుకు సాగిన వైనాన్ని జిన్‌పింగ్‌ ప్రస్తావించారు. కిమ్‌ నాయకత్వంలో రెండు దేశాల బంధం, విశ్వాసం మరింత పెరుగుతుందని, కొత్త, గొప్ప విజయాలు వరిస్తాయని జిన్‌పింగ్‌ విశ్వాసం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img