Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ మృతి

ఇస్లామాబాద్‌/ దుబాయ్‌:
పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ (79) మృతిచెందారు. కొంత కాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ దుబాయ్‌లోని అమెరికన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముషారఫ్‌ ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు పాకిస్తాన్‌ మీడియా పేర్కొంది. ముషారఫ్‌ 2016 నుంచి దుబాయ్‌లో ఉంటూ అక్కడే చికిత్స పొందుతున్న విషయం విదితమే. ముషారఫ్‌ అంత్యక్రియలు పాకిస్తాన్‌లో నిర్వహించేందుకు ఆయన కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. దుబాయ్‌లోని నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక సైనిక జెట్‌ విమానంలో ముషారఫ్‌ భౌతికకాయాన్ని పాకిస్తాన్‌కు తరలించనున్నారు. ఇందుకోసం దుబాయ్‌లోని పాకిస్తాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ హస్సన్‌ అఫ్జల్‌ ఖాన్‌ ఎన్‌ఓసీ జారీ చేసినట్లు పాకిస్తాన్‌ మీడియా పేర్కొంది. అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని ముషారఫ్‌ కుటుంబానికి ఖాన్‌ హామీనిచ్చారని వార్తా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ముషారఫ్‌ మరిణించిన వెంటనే పాకిస్తాన్‌ సైనిక విభాగమైన ఇంటర్‌`సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐఎస్‌పీఆర్‌) ఒక ప్రకటనలో ఆయన మరణానికి సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని ప్రకటించింది. ముషారఫ్‌ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధికార బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు 2019లో ఆయనకు మరణశిక్ష ఖరారు చేశారు. ముషారఫ్‌కు వ్యతిరేకంగా షరీఫ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ రాజ్యాంగ విరుద్ధమని లాహోర్‌ హైకోర్టు 2020లో తీర్పునివ్వడంతో మరణశిక్ష రద్దు అయింది. ముషారఫ్‌ 1943 ఆగస్టు 11న దిల్లీలో జన్మించారు. దేశ విభజన తర్వాత ముఫారఫ్‌ కుటుంబం పాకిస్తాన్‌కు తరలిపోయింది. లాహోర్‌లోని ఫార్మన్‌ క్రిష్టియన్‌ కాలేజీలో ముషారఫ్‌ విద్యాభ్యాసం జరిగింది. అనంతరం ఆయన లండన్‌ వెళ్లి అక్కడి రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఢఫిెన్స్‌ స్టడీస్‌లో శిక్షణ పొందారు. 1961లో పాక్‌ మిలిటరీ అకాడమీలో చేరారు. 1964లో పాకిస్తాన్‌ సైన్యంలో విధుల్లోకి వచ్చారు. అప్పటికి ఆయనకు 18ఏళ్లు. 1965, 1971 భారత్‌-పాక్‌ యుద్ధాల్లో పాల్గొన్నారు. 1990లో మేజర్‌ జనరల్‌ అయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ పాక్‌ సైన్యాధ్యక్షుడి అయ్యారు. ఆపై పాక్‌ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ముషారఫ్‌ తండ్రి పాకిస్తాన్‌ విదేశాంగ శాఖలో పనిచేయగా ఆయన తల్లి ఉపాధ్యాయురాలుగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img