Friday, April 19, 2024
Friday, April 19, 2024

పాక్‌ వ్యాపితంగా నిరసన ప్రదర్శనలు

వజీరాబాద్‌ (పాకిస్థాన్‌) : పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యా ప్రయత్నానికి నిరసనగా శుక్రవారం దేశవ్యాపితంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. శుక్రవారం ప్రార్ధనల అనంతరం దేశమంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న ఇమ్రాన్‌ ఖాన్‌ డిమాండ్‌ నెరవేరే వరకు నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని ఖాన్‌ సహాయకుడు అసద్‌ ఉమర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలతో పాటు ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ రాజీనామా చేయాలని కూడా ఖాన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏప్రిల్‌లో పార్లమెంటులో ఓటింగ్‌ ద్వారా అధికారం నుండి ఖాన్‌ను తొలగించిన సంకీర్ణ పార్టీలకు షెహబాజ్‌ నాయకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఖాన్‌ మద్దతుదారులు ఆయనపై హత్యాయత్నం జరిగిన ప్రదేశంలో ఉదయం గుమిగూడి ఇస్లామాబాద్‌కు లాంగ్‌మార్చ్‌ని మాజీ ప్రధాని తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మార్చ్‌ ముందుకు సాగాలి. దాన్ని ఆపకూడదు. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. అది మరింత ఉధృతమవుతుంది’’ అని ఖాన్‌ మద్దతుదారుడు అన్సార్‌ బషీర్‌ (40) పాకిస్థాన్‌ తెహ్రీక్‌ఇన్సాఫ్‌ (పీటీఐ) పతాకాన్ని చేబూని రాయిటర్స్‌ వార్తాసంస్థకు చెప్పారు. ఖాన్‌పై కాల్పులు జరిగినప్పుడు ఘటన ప్రదేశానికి దాదాపు 30 అడుగుల దూరంలో ఉన్నానని బషీర్‌ చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సాక్ష్యాల సేకరణకు రాత్రంతా పని చేశారని ఆయన తెలిపారు.
ఇస్లామాబాద్‌కు తూర్పుగా 200 కి.మీ. దూరంలో ఉన్న వజీరాబాద్‌లో దుకాణాలతో రద్దీగా ఉండే వీధిలో ఘటన జరిగిన ప్రదేశంలోనే ఖాన్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి ఉంచారు. మోకాలు క్రిందిభాగం, తొడ భాగంలలో రెండు బుల్లెట్‌లు ఖాన్‌కు తగిలాయని పంజాబ్‌ (పాక్‌) ఆరోగ్య మంత్రి, పీటీఐ సభ్యుడు కూడా అయిన డా॥ యాస్మీన్‌ రషీద్‌ రాయిటర్స్‌కి చెప్పారు. తనపై జరిగిన దాడి వెనుక ప్రధానమంత్రి షరీఫ్‌, హోంమంత్రి రాణాసనావుల్లా, నిఘా అధికారి మేజర్‌`జనరల్‌ ఫైసల్‌ ఉన్నారని ఆరోపిస్తూ, పోలీసులు వారిపై దర్యాప్తు జరపాలని ఖాన్‌ డిమాండ్‌ చేసినట్లు పంజాబ్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి, పీటీఐ నాయకుడు ముస్సారత్‌ జంషెడ్‌ చీమా తెలిపారు. ఈ ఆరోపణకు మద్దతుగా ఖాన్‌, ఆయన పార్టీ ఎట్టి సాక్ష్యాన్ని సమర్పించలేదు. షరీఫ్‌, సనావుల్లా తమ ప్రమేయాన్ని నిరాకరించారు. ఖాన్‌ ఆరోపణపై వ్యాఖ్యానించవలసిందిగా చేసిన అభ్యర్థనకు సైన్యం స్పందించలేదు. ఖాన్‌ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై పారదర్శక విచారణ జరపాలని కూడా షరీఫ్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img